తెలంగాణాలో ముందస్తు ఎన్నికల వేడి పెరుగుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర్ రాజ నరసింహ భార్య బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ కార్యాలయంలో బిజెపి తెలంగాణా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో దామోదర్ భార్య పద్మినీరెడ్డి  కమలం కండువా కప్పుకోవటం రెండు పార్టీల్లోను చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీలో దామోదర్ సీనియర్ నేతన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. ముందస్తు ఎన్నికల హడావుడిలో ఉన్న రాజనరసింహ మ్యానిఫెస్టో కమిటికి ఛైర్మన్ గా ఉన్నారు. నిజానికి ఎన్నికల హడావుడిలో దామోదర్ చాలా బిజిగా ఉన్నారనే చెప్పాలి.

 

కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన రాజనరసింహ పోయిన ఎన్నికల్లో ఆంథోల్ నుండి పోటీ చేశారు. టిఆర్ఎస్ అభ్యర్ధి బాబూమోహన్ చేతిలో ఓడిపోయారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యుటి సిఎంగా కూడా దామోదర్ ఉన్నవిషయం తెలిసిందే. ఒకవైపు మ్యానిఫెస్టో కమిటి ఛైర్మన్ గా ఉంటూనే మరోవైపు  మళ్ళీ ఆంథోల్ లో పోటీకి రెడీ అవుతున్నారు.


ఇటువంటి సమయంలో ఆయన భార్య పద్మినీరెడ్డి అనూహ్యంగా బిజెపిలో చేరారు. దాంతో కాంగ్రెస్ నేతలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటువంటి సమయంలోనే పద్మినీరెడ్డి భాజపాలో చేరటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


కాకపోతే ఇక్కడే ఒక మతలబుంది. ఏమిటంటే, దామోదర్ అనుమతి లేకుండానే ఆయన భార్య పద్మిని బిజెపిలో చేరగలరా ? దశాబ్దాలుగా దామోదర్ కుటుంబం కాంగ్రెస్ లోనే ఉంది. ఓడినా గెలిచినా దామోదర్ కాంగ్రెస్ లోనే ఉన్నారు. వెళితే గిళితే దామోదర్ పార్టీ మారాలి కాని ఆయన భార్య పార్టీ మారటమేంటో అర్దం కావటం లేదు. కాకపోతే ఓ విషయం చర్చ జరుగుతోంది. రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారంలోకి రాకపోతే ఎందుకైనా మంచిదని దామోదరే భార్యను బిజిపిలో చేరమని ప్రోత్సహించుంటారనే ఇన్ సైడ్ టాక్.  

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: