బెజ‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ రాజ‌కీయాల వేడి ఇంకా చ‌ల్లార‌లేదు. విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ టికెట్‌ను తనకు కాదని మల్లాది విష్ణుకు పార్టీ దాదాపు ఖరారు చేయడంతో ఇక్క‌డ రాజ‌కీయంగా మంచి ఊపుమీదున్న వంగ‌వీటి రాధా కినుక వహించారు. దీంతో సెప్టెంబరు 18 నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు విష్ణు సెంట్రల్‌ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో తిరుగుతున్నారు. ఇటీవ‌లే ఆయ‌న పాద‌యాత్ర ప్రారంభించారు. దీనికి పోటీగా రాధా కూడా వ్య‌తిరేక పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాధా పార్టీని వీడుతారన్న ప్రచారం ఊపందుకుంది. రాధాను దూరం చేసుకుంటే కాపు సామాజికవర్గంలో వ్యతిరేకత వస్తుందని భావించిన వైసీపీ అధిష్ఠానం హుటాహుటిన అప్ర‌మ‌త్త‌మైంది.


పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయి రెడ్డిని రంగంలోకి దింపింది. బ్రాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలన్న ఆలోచనతోనే మల్లాది విష్ణును సెంట్రల్‌ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నియమించామని, అంతే తప్ప రాధాను దూరం చేసుకోవాలన్న ఆలోచన పార్టీకి లేదని రాధాకు విజయసాయి తెలిపినట్లు సమాచారం. ఈ వాదనపై రాధా తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాను ఆశిస్తున్న స్థానాన్ని వేరే వ్యక్తికి ఇచ్చేటప్పుడు తనను కనీసం సంప్రదించక పోవడం ఏమిటని నిలదీసినట్లు సమాచారం. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు రోజులపాటు తన అనుచరులు ఆందోళన వ్యక్తం చేసినా పార్టీ తరఫున ఒక్క సానుకూల ప్రకటన వెలువడకపోవ‌డం దేనికి సంకేత‌మ‌ని ఆయ‌న గ‌ట్టిగానే విజ‌య‌సాయిని నిల‌దీశారు. 


అయితే, అంతే గ‌ట్టిగా.. విజ‌య‌సాయి కూడా స్పందించార‌ని స‌మాచారం. ముందు బ‌తిమాలిన‌ట్టు వ్యాఖ్య‌లు చేసినా త‌ర్వాత మాత్రం ఒకింత ప‌రుషంగానే సెంట్ర‌ల్ టికెట్ ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని వెల్లడించిన‌ట్టు స‌మాచారం. జిల్లాలో తనకు అనుకూలమైన ఏ స్థానం నుంచి పోటీ చేసినా పార్టీ అభ్యంతర పెట్టబోదని, అయితే, సెంట్ర‌ల్ సీటును మాత్రం ఇచ్చే ప్ర‌స‌క్తి లేద‌ని తేల్చిచెప్పార‌ట విజ‌య‌సాయి. దీంతో రాధా కూడా అంతే తీవ్రంగా స్పందిస్తూ.. ఇందుకేనా.. పార్టీకి ఇన్నాళ్లు సేవ చేసింది? అని ప్ర‌శ్నించి చ‌ర్చ‌ల‌ను అర్ధంత‌రంగానే ముగించిన‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ వియ‌జ‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయాలు వైసీపీలో చిచ్చు పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాధా ప‌ట్టు వీడ‌క‌పోవ‌డం, జ‌గ‌న్ బెట్టు వీడ‌క‌పోవ‌డంతో ఏం జ‌రుగుతుందోన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు ఆస‌క్తిగా చూస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: