తన కోటరీతో ఎటువంటి సంబంధం లేకుండానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ రహస్య సర్వే చేయిస్తున్నారని సమాచారం. క్షేత్రస్ధాయిలో పార్టీ బలమేంటి ? బలహీనతలేంటి ? అనే అంశాలపై సర్వే జరుగుతోంది. అదే సమయంలో రానున్న ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లో పార్టీ తరపున ఎటువంటి అభ్యర్ధులను నిలబెట్టాలి, ప్రత్యర్ధి పార్టీల తరపున బరిలోకి దిగబోతున్నదెవరు ? లాంటి అనేక అంశాలపై ప్రత్యేకంగా ఓ బృందం ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తు వివరాలు సేకరిస్తోందట.

రానున్న ఎన్నికల్లో పార్టీ తరపున టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహుల విషయంలో పవన్ కోటరిపై ఇప్పటికే చాలా ఆరోపణలున్నాయి. కోటరీలోని కొందరు కీలక వ్యక్తులు ఎవరికి వారుగా వివిధ నియోజకవర్గాల్లో తమ మద్దతుదారులకు టిక్కెట్లపై హామీలిచ్చేస్తున్నారు. ఒకే నియోజకవర్గంలో కోటరీలోని వివిధ వ్యక్తులకు టిక్కెట్లు హామీలిస్తుండటంతో కోటరీలోని వ్యక్తుల మధ్య రచ్చ జరుగుతోంది. ఆ రచ్చే చివరకు పెద్దదై రోడ్డున పడి పవన్ కు తలనొప్పులు తెస్తోంది.

 

అందుకనే కోటరీతో ఎటువంటి సంబంధం లేకుండానే తానే ప్రత్యేకంగా ఓ బృందంతో రహస్య సర్వే  చేయించాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఓ రిటైర్డ్ డిస్పీ స్ధాయి నేతృత్వంలో మరికొందరు రిటైర్ అయిన పోలీసు అధికారుల బృందం సర్వే చేస్తోంది. ఈ బృందం ప్రధానంగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది. పార్టీ తరపున టిక్కెట్లు ఆశిస్తున్న వ్యక్తుల స్ధాయితో పాటు  వారి నేపధ్యాలను వడపోస్తోంది. అదే సమయంలో ప్రత్యర్ధి పార్టీల్లోని అభ్యర్ధులు, వారి బలాల, బలహీనతలు, ఇతర పార్టీల్లో టిక్కెట్లు దక్కించుకునే అవకాశాలు ఎవరికున్నాయి ? మరి మిగిలిన నేతలేం చేస్తారు ? అనే అంశాలను ప్రధానంగా పరిశీలిస్తోంది.


అంటే ఇతర పార్టీల్లో టిక్కెట్లు దక్కని నేతల్లో గట్టి వారిపై ప్రత్యేకంగా ఈ బృందం దృష్టి పెట్టినట్లు సమాచారం. నిజానికి జనసేనకు ఏ స్ధాయిలోనూ బలం లేదు. ఎందుకంటే, సంస్ధాగతంగా బలోపేతానికి పవన్ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కేవలం అభిమానులను మాత్రం పరిగణలోకి తీసుకుని వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. అన్నీ నియోజకవర్గాల్లోను పోటీ చేయాలని అనుకున్న తర్వాత అభ్యర్ధులు లేకపోతే ఎలా ? అందుకే ఇతర పార్టీల్లోని అసంతృప్తులపై కన్నేసినట్లు స్పష్టమవుతోంది. ఆ విషయంలోనే రహస్య సర్వే జరుగుతోంది. సర్వే బృందం తన రిపోర్టు ఇచ్చిన తర్వాతే పవన్ ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేయటం మొదలుపెడతారన్నమాట.


2009లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం అనుభవాలను కూడా పవన్ దృష్టిలో పెట్టుకున్నారు. అప్పట్లో కూడా క్షేత్రస్ధాయిలో సంబంధాలు లేకుండానే చాలామందికి చిరంజీవి టిక్కెట్లిచ్చేశారు. ఆశావహుల నుండి పెద్ద ఎత్తున డబ్బు తీసుకుని టిక్కెట్లిచ్చారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.  మిగిలిన అభ్యర్ధల  సంగతిని పక్కన పెట్టినా చివరకు పాలకొల్లులో పోటీ చేసిన పార్టీ అధ్యక్షుడు చిరంజీవే ఓడిపోవటం అప్పట్లో సంచలనం. అప్పట్లో అభ్యర్ధుల ఎంపికలో చిరంజీవి చేసిన తప్పులను తాను చేయకూడదనే ప్రత్యేకంగా ఓ సర్వే బృందాన్ని పెట్టుకుని సర్వే చేయించుకుంటున్నట్లు సమాచారం. మరి, చూడాలి పవన్ ప్రయత్నం ఏ మేరకు ఫలితాలిస్తుందో .


మరింత సమాచారం తెలుసుకోండి: