రాజ‌కీయాల‌కు, సినీ గ్లామ‌ర్‌కు అవినాభావ సంబంధం ఉంది. ఇది రాష్ట్రాల‌కు అతీతం. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు ఈ దేశంలో పాపుల‌ర్ సినీ గ్లామ‌ర్‌ను రాజ‌కీయ నేతలు త‌మ‌కు అనువుగా వాడుకోవ‌డం, సినీ ప్ర‌పంచంలో ఉన్న వారు రాజ‌కీయాల్లోకి రావ‌డం తెలిసిందే. ఇది ఉత్త‌రాది కంటే కూడా ద‌క్షిణాదిలోనే ఎక్కువ‌గా ఉండడం స్పెష‌ల్‌. వెండితెర‌పై రారాజులుగా నిలిచిన వారు త‌ర్వాత కాలంలో నిజ‌మైన నాయ‌కులై ప్ర‌జాసేవ చేసిన చ‌రిత్ర ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఏ పార్టీలో చూసినా.. సినీ ప్ర‌ముఖులు ఖ‌చ్చితంగా క‌నిపిస్తున్నారు. ఇప్పుడు ఈ కోవ‌లోనే అతి పెద్ద జాతీయ పార్టీగా అవ‌త‌రించిన బీజేపీ కూడా సినీ తార‌ల‌తో రాజ‌కీయాల‌ను రంజింప చేస్తోంది. 


విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న‌ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో బీజేపీ ఒంట‌రిగా పోటీలోకి దిగుతోంది. అంతేకాదు, అధికారంలోకి రావాల‌ని కూడా ప‌క్కాగా నిర్ణ‌యించుకుంది. నిజానికి ద‌క్షిణాదిలో ఏదో ఒక ప్రాంతీయ పార్టీ తో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆ పార్టీ ఈ సారి మాత్రం సొంత సామ‌ర్థ్యాన్ని న‌మ్మొకొంటోంది. అమీత్ షాతో పాటు మోడీని తెలంగాణ‌లో ప్ర‌చారంలో వినియోగించుకుంటే మంచి ప్ర‌భావం ఉంటుంద‌ని తెలంగాణ బీజేపీ నాయ కులు భావిస్తున్నారు. అయితే, పోటీ తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో వారు సినీగ్లామ‌ర్‌ను సైతం న‌మ్ముకుంటున్నారు.  ఈ క్ర‌మం లో ఏకంగా ఇద్ద‌రు క‌ధానాయిక‌ల‌ను ఎన్నిక‌ల రంగంలోకి దించి ముంద‌స్తు పోల్ ను సూప‌ర్ పోల్ గా మార్చాల‌ని బీజేపి భావిస్తోంది.


తెలుగు తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న తెలుగు హీరోయిన్లు మాధవీ లత, రేష్మా రాథోడ్ కొద్దిరోజుల క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సినీ రంగంలోని కొందరు ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకోవాలని భావించిన బీజేపీ.. ఇందులో భాగంగానే మాధవీ లత, రెష్మా రాథోడ్‌లను బీజేపీలోకి ఆహ్వానించి, వారికి సుముచిత స్థానం కల్పించారు. మాధవీలత పార్టీ కండువా కప్పుకున్న తర్వాత పెద్దగా కనిపించలేదు కానీ, మరో నటి రెష్మా మాత్రం బీజేపీ యువజన విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయింది. దీంతో ఆ పార్టీలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతూ, పార్టీ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అధిష్టానాన్ని ఆకర్షించింది. దీంతో ఈమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించిందని ప్రచారం జరుగుతోంది. 


ఖమ్మంలోని వైరా నియోజకవర్గంపై రేష్మా కన్నేసింది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ స్థానాన్ని బీజేపీ వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేని కారణంగానే రెష్మా ఈ స్థానాన్ని ఎంచుకున్నట్లు సమా చారం. వైరా నియోజకవర్గం నుంచి కాకుండా బీజీపీ అధిష్ఠానం మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ప్రొఫెసర్‌ సీతారాం గెలుపొందారు. ఈనేపథ్యంలో ఎస్టీ ఓట్లను పొందేందుకు రేష్మను బీజేపీ రంగంలోకి దించేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. అలాగే మాధవిని కూడా ప్రచారానికి వాడుకోవాలని చూస్తోందట బీజేపీ అధిష్ఠానం. మ‌రి వీరు ఏ మేర‌కు తెలంగాణ బీజేపీని ఒడ్డున ప‌డేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: