జరుగుతున్న ఐటి దాడులకు ఓటుకునోటు కేసుకు లింకుందా ? ఇపుడీ అంశంపైనే చర్చలు మొదలయ్యాయి. మూడున్నరేళ్ళ నాటి ఓటుకునోటు కేసు మొదట్లో హడావుడి జరిగినా తర్వాత చప్పపడిపోయింది. మెల్లిగా కేసు విచారణ కూడా కోల్డ్ స్టోరేజిలో పడిపోయింది. అయితే, పోయిన నెలలో తెలంగాణాలో ఓటుకునోటు కేసులోనే ఏ 1 అయిన రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటి అధికారులు మళ్ళీ దాడులు చేశారు. దాదాపు 43 గంటల పాటు ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. 33 గంటలపాటు రేవంత్ ను ఇంటిలోనే విచారించారు. తర్వాత నోటీసిచ్చి విచారణ పేరుతో ఐటి కార్యాలయానికి కూడా అధికారులు పిలిపించుకున్నారు. విచారణ పేరుతో రేవంత్ తో పాటు ఉదయసింహ, సెబాస్టియన్ తదితరులను కూడా రప్పించుకున్నారు లేండి.

 

చాలా కాలానికి ఆ కేసులో కదిలిక వచ్చిందని అందరూ అనుకుంటున్న నేపధ్యంలోనే హఠాత్తుగా ఏపిలో కూడా దాడులు మొదలయ్యాయి. మొదటగా నెల్లూరులో చంద్రబాబునాయుడుకు బాగా సన్నిహితుడైన బీద మస్తాన్ రావు ఇల్లు, కార్యాలయాలపైన దాడులు జరిగాయి. తర్వాత విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం కేంద్రాల్లో తెలుగుదేశంపార్టీతో సన్నిహితంగా ఉండే వ్యాపారస్తులు, ప్రకాశం జిల్లా కందుకూరు ఎంఎల్ఏ పోతుల రామారావు సంస్ధలపైన కూడా దాడులు జరిగాయి.


ఆ తర్వాత హఠాత్తుగా కేంద్ర మాజీ మంత్రి, టిడిపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మీద ఈడీ దాడులు జరగటం ఈరోజు మరో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పై ఐటి సోదాలు  జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏదో గొలుసుకట్టు దాడుల్లాగ అందరికీ అనుమానం వస్తోంది. రెండోసారి రేవంత్ ఇంటిపై దాడులు జరిగిన తర్వాతే ఏపిలో కూడా హఠాత్తుగా ఇంతమంది మీద ఐటి దాడులు జరగటంతో అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి. ఓటుకునోటు కేసుకు సంబంధించి ఒక్కసారిగా విచారణ వేగవంతమవుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఓటుకునోటు కేసులో తెరవెనుక సూత్రదారి చంద్రబాబే అని అందరిలోను ఎప్పటి నుండో అనుమానాలున్నాయి.


అప్పట్లో తెలంగాణా నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ ఓటు కొనుగోలుకు కుదుర్చుకున్న బేరం రూ 5 కోట్లు, అడ్వాన్స్ గా ఇవ్వబోయిన రూ 50 లక్షలు ఎక్కడివి ? ఎవరు సర్దబాటు చేశారు ? అన్నదే చాలా కీలకం. ఆ విషయంపైనే రేవంత్ ను ఐటి అధికారులు పదే పదే విచారిస్తున్నారు. ఇపుడు ఏపిలో జరుగుతున్న దాడులకు మొన్న రేవంత్ విచారణకు ఏమైనా సంబంధాలున్నాయా ? అనే విషయంపైనే టిడిపిలో ప్రచారం జరుగుతోంది.

 

ఎందుకంటే, నామినేటెడ్ ఎంఎల్ఏకి ఇవ్వబోయిన రూ 50 లక్షలు సర్దుబాటు చేసింది వీళ్ళే అంటూ సిఎం రమేష్, సుజనా చౌదరి, మంత్రి నారాయణ, నామా నాగేశ్వర రావు పేర్లు ప్రచారం జరిగింది. ప్రచారంలో చాలామంది పేర్లే ఉన్నా ఎవరు చేశారన్నది ఇప్పటికి సస్పెన్సే. అందుకే వరుసబెట్టి ఐటి దాడులు జరుగుతున్నాయనే ప్రచారం ఊపందుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: