వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాజకీయం యమ రంజుగా ఉంటుందని తాజా రాజకీయ పరిణామాలు చేప్పేస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక పార్టీలో ఉన్నవారు తెల్లారితే మరో పార్టీలోకి జంప్‌ చేసేస్తున్నారు. రాజకీయాల్లో ఎవరికి ఎవరూ శాశ్వత శత్రువులు కాదు...  శాశ్వత మిత్రువులు కాదు అన్నట్టు ఈ రోజు మిత్రులుగా ఉన్నవారే రేపు శత్రువులు అవుతున్నారు. ఈ రోజు శత్రువులుగా ఉన్న వారు రేపు మిత్రులు అవుతున్నారు. రాజకీయాల్లో అందరి  లక్ష్యం ఒకటే. ఎన్నికల్లో పోటీ చెయ్యాలి, సీటు సంపాదించాలి, విజయం సాధించాలి, పదవిని అనుభవించాలి. నిన్నటి వరకు వైసీపీకి నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్నవారి తలరాతలు అనుహ్యంగా మారిపోతున్నాయి. ముమ్మడివరంలో పితాని బాలకృష్ణ, కొండపిలో వరికూటి అశోక్‌బాబు, తాడికొండ‌లో కత్తెర హెన్నీ క్రీస్టియానా, గుంటూరు వెస్ట్‌లో లేళ్ల అప్పిరెడ్డి, చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్‌, నేడో రేపో పెదకూరపాడులో కావటి మనోహర్‌ నాయుడు వీళ్లందరిని తప్పించేస్తున్నారు. వీరి స్థానాల్లో కొత్త సమన్వయకర్తలు వచ్చేస్తున్నారు. 


ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ సమన్వయకర్తలుగా కొనసాగుతున్నవారికి సైతం వచ్చే ఎన్నికల్లో  బీఫామ్‌ చేతికి వచ్చేంత వరకు తాము ఎన్నికల్లో పోటీ చేస్తామో లేదో తెలియని పరిస్థితి. ఏపీలో వైసీపీ అభ్యర్థులకు షాకుల మీద షాకులు తగులుతున్న గుంటూరు జిల్లాలో అదిరిపోయే ట్విస్ట్‌ చోటుచేసుకోనుందని తెలుస్తోంది. ప్రస్తుతం గురజాల వైసీపీ సమన్వయకర్తగా ఉన్న కాసు మహేష్‌ రెడ్డి వచ్చే ఎన్నికల వేళ‌ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారా ? ఆయన టీడీపీ నుంచి నరసారావుపేట అసెంబ్లీకి పోటీ చేస్తారా ? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. తాజాగా గుంటూరు మిర్చి యార్డ్‌ చైర్‌మేన్‌గా నిన్నటి వరకు ఉన్న మన్నం సుబ్బారావును తప్పించి ఆ ప్లేస్‌లో పార్టీ సీనియర్‌ నేత వెన్నా సాంబశివరెడ్డికి బాధ్య‌తలు అప్పగించారు. ఈ మార్పు నేపథ్యంలో చంద్రబాబు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. 


ఈ సమావేశంలో స్పీకర్‌ కోడెలను ప్రత్యేకంగా లోపలికి పిలిపించుకున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో నీకు నరసారావుపేట, సత్తెనపల్లి సీట్లలో సత్తెనపల్లి చాలా అనుకూలంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. నువ్వు అక్కడే పోటీ చెయ్యి అని కోడెలతో చెప్పగా... కోడెల అందుకు సుముఖ‌త వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అదే టైమ్‌లో కాసు మహేష్‌ రెడ్డిను పార్టీలోకి తీసుకుంటున్నాను, నీకు ఏదైనా అభ్యంతరం ఉందా అని కోడెలను బాబు ప్రశ్నించగా నాకేం అభ్యంతరం లేదు, మహేష్‌ రెడ్డిని మాచర్లలో పోటీ చేయించమని బాబుకు సూచించినట్టు తెలిసింది. అయితే బాబు మహేష్‌ రెడ్డికి ఎక్కడ సీటు ఇవ్వాలన్నది నేను నిర్ణయించుకుంటాను.. పార్టీలోకి తీసుకునే వ‌ర‌కు నీకేం అభ్యంతరం లేదుగా అని మరో సారి ప్రశ్నించగా కోడెల తనకేం అభ్యంతరం లేదని చెప్పారట. 


ఇక ఇప్ప‌టికే న‌ర‌సారావుపేట‌లో కోడెల‌కు స‌న్నిహితుడు అయిన కాసు మ‌హేష్‌రెడ్డి బాబాయ్ కోడెల కృష్ణారెడ్డి పేరుతో స‌ర్వే కూడా జ‌రిగింది. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాసు మహేష్‌ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో నరసారావుపేట నుంచి అసెంబ్లీ బరిలో దింపడం దాదాపు ఖాయమేనని తెలుస్తోంది. ఆయ‌న త్వ‌ర‌లోనే పార్టీ మార‌తార‌ని కూడా స‌మాచారం. దీన్ని బట్టి చూస్తే గుంటూరు జిల్లాలో నిన్నటి వరకు జగన్‌ వైసీపీ సమన్వయకర్తలకు షాక్‌ ఇస్తుంటే ఇప్పుడు కొత్తగా జగన్‌ ఎంతో నమ్మకం పెట్టుకున్న వైసీపీ సమన్వయకర్తే జగన్‌కు అదిరిపోయే షాక్‌ ఇస్తున్నట్టు క్లియర్‌కట్‌గా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: