ఏపీ కేబినేట్‌లో ఆ మంత్రి నాలుగున్నర ఏళ్లకు పైగా తన ఇష్టా రాజ్యంగా వ్యవహరించారు. తన శాఖలో తనకు తిరుగు లేదు... ఎన్ని ఆరోపణలు వచ్చినా చంద్రబాబు ఆయననే కొనసాగించారు. గత కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో తీవ్రమైన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనను తప్పించాలని అనుకున్నా సామాజిక సమీకరణలు అనేక రకాల ఈక్వేషన్లు, తీవ్ర‌మైన ఒత్తిళ్ల నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఎంతో ఆలోచించి తిరిగి ఆయననే కంటిన్యూ చేశారు. అటు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఇన్‌ఛార్జ్‌  మంత్రిగానూ ఆయన వెలగబెట్టింది ఏమి లేదు. ఆయన ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ఉన్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పార్టీ కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతున్నా ఆయన ఏ మాత్రం ఉపయోగపడలేదు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగాను... శాఖా మంత్రిగానూ ఫేల్‌ అయిన ఆయన ఇటు శాఖలోనూ ఇప్పటికీ పట్టు సాధించలేకపోయారు. 


ఇక నియోజకవర్గంలో ఆయన కుటుంబసభ్యుల పెత్తనంపై తీవ్రమైన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అటు నియోజకవర్గంలో మంత్రిగారి భార్యామణి చెప్పిందే వేదం. అధికారుల‌ బదిలీల‌ వ్యవహారంలోను ఆమె చెప్పినట్టే జరుగుతుందన్నది ఓపెన్‌ టాక్‌. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆ మంత్రి ఇంటికి వెళ్లే దారిని వీఐపీఈ జోన్‌ కింద మార్చేసుకున్నారు. నాలుగేళ్లుగా  ఆ మంత్రి చేసిందేమి లేకపోయినా.. ఆయన వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఒరిగిందేమి లేకపోయిన ఆయనకు తిరుగు లేదన్నట్టుగా ఆయన వ్యవహారం కొనసాగింది. కట్‌ చేస్తే ఇప్పుడు పుల్లారావు ఓ లేడీ ఫైర్‌ బ్రాండ్‌ దెబ్బకు గిలగిలలాడిపోతున్నారు. ఆ లేడీ ఫైర్‌ బ్రాండ్‌ దూకుడుతో ఆయనకు కంటి నిండా కునుకే కరువు అయ్యిందట. 


వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై వైసీపీ నుంచి లేడీ ఫైర్‌ బ్రాండ్‌ విడదల రజినీ పోటీకి దిగుతున్నారు. నిన్నటి వరకు తనకు తిరుగు లేదు అన్నట్టుగా ఉన్న పుల్లారావుకు రజినీ దూకుడుతో ఇప్పుడు నియోజకవర్గంలో చెమటలు పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే చిలకలూరిపేటలో తాను ఈజీగా గెలుస్తానని మళ్ళీ మంత్రి అవ్వొచ్చని లెక్కలు వేసుకున్నా ఆయన ఇప్పుడు రజినీ దూకుడు దెబ్బతో విల‌విల్లాడుతున్నారు. అసలు మేటర్‌ ఏమిటంటే గత ఎన్నికల్లో జిల్లాల్లో టీడీపీ గాలి బలంగా వీచినా.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సపోర్ట్‌ చేసిన అటువైపు మర్రి రాజశేఖర్‌ ఆర్థికంగా వీక్‌గా ఉండి, డబ్బుల విషయంలో పోటీ ఇవ్వలేకపోయినా పుల్లారావు కేవలం 10 వేల ఓట్ల మెజార్టీతో మాత్రమే విజయం సాధించారు. 


ఇప్పుడు గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు అనుకూలంగా ఈక్వేష‌న్లు క‌లిసొచ్చేలా లేవు. ర‌జ‌నీకి సామాజికంగానే అనేక ఈక్వేష‌న్లు క‌లిసి రానున్నాయి. పేట‌లో చ‌రిత్ర‌లో తొలిసారి బీసీల‌కు...అది కూడా ఓ మ‌హిళ‌కు సీటు ఇవ్వ‌డంతో వారంతా ఏక‌మ‌వుతున్నారు. త‌న సొంత సామాజిక‌వ‌ర్గంలోని కొంద‌రు సైతం ర‌జ‌నీ చెంత‌కు చేరువ‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక మాట‌కారి, ఆర్థికంగా బ‌లంగా ఉన్న రజినీ పోటీ చెయ్యడం... మహిళలను ఆమె భాగా ఆకట్టుకుంటూ దూసుకుపోతుండడంతో మైనార్టీ, ఎస్సీ, బీసీ, కాపు ఈక్వేషన్లతో పాటు మహిళల ఓట్లను సైతం ఆమె భారీగా చీల్చే ఛాన్సులు ఉండడంతో ఏం చెయ్యాలని పుల్లారావు వర్గం తలలు పట్టుకుంటుంది. టీడీపీలో అసమ్మ‌తి వర్గాల సైతం పుల్లారావు & ఫ్యామిలి తీరుపై నిన్నటి వరకు రగిలిపోయి ఉన్నారు. ఇప్పుడు వారంతా వచ్చే ఎన్నికల్లో సైలెంట్‌ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇది కూడా  పుల్లారావుకు పెద్ద ఎదురుదెబ్బే.



మరింత సమాచారం తెలుసుకోండి: