మొన్నటి వరకూ తెలంగాణా ఎన్నికల్లో పోటీ విషయంలో స్పష్టత లేని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చివరకు  24 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు చూచాయగా తెలిపారు. మొత్తం 119 స్ధానాలకు గాను జనసేన పోటీ చేయబోయే స్ధానాలపై పవన్ దాదాపు ఓ క్లారిటి ఇచ్చేసినట్లే. సరే సంఖ్య విషయంలో కూడా  నాలుగు రోజుల్లో మరింత క్లారిటీ ఇస్తానని చెప్పారనుకోండి. రెండు రాష్ట్రాల్లోను రాజకీయాలు  చేసే ఉద్దేశ్యంతోనే పవన్ తెలంగాణాలోని కరీంనగర్, నల్గొండతో పాటు మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. తర్వాత ఏమైందో ఏమో ?  మళ్ళీ తెలంగాణాలో పర్యటించలేదు.

 

నిజానికి తెలంగాణాలో కూడా పవన్ కు బాగానే అభిమానులున్నారు. పార్టీ నిర్మాణమన్నది రెండు రాష్ట్రాల్లోను లేదనుకోండి అది వేరే సంగతి. తెలంగాణాలో పర్యటించిన కొంత ప్రాంతంలోనే అభిమానులు పవన్ సభలకు పోటెత్తారు. అయితే, వారిలో ఎంతమందికి ఓట్లున్నదో ఎవరికీ తెలీదు. పార్టీ నిర్మాణం లేకుండడానే ఎన్నికలకు వెళ్ళాలని అనుకుంటున్నారంటే కేవలం అభిమానులను మాత్రమే నమ్ముకుని రాజకీయం చేద్దామని పవన్ డిసైడ్ అయినట్లు అర్ధమైపోతోంది.

 

ఏపిలోని 175 సీట్లకూ పోటీ చేస్తామని పవన్ చాలాసార్లే ప్రకటించినా ఎవరికీ నమ్మకం అయితే కలగటం లేదు. ఎందుకంటే పార్టీలో చెప్పుకోతగ్గ నేతలెవరు లేరు కాబట్టే. మిగిలిన పార్టీల్లో గ్రామీణ ప్రాంతాల నుండి పార్టీ నిర్మాణం జరిగింది కాబట్టి పటిష్టమైన నాయకత్వం ఉంది. కాబట్టే ఆ పార్టీలకు ఎవరో ఒకరు ప్రతీ నియోజకవర్గంలోను దొరుకుతారు. కానీ జనసేన విషయం అదికాదు. అందుకనే పవన్ మాటలను  ఎవరూ నమ్మటం లేదు. సరే ఎటూ ఎన్నికల షెడ్యూల్ దగ్గరకు వచ్చేస్తోంది కదా ? అప్పటికి పవన్ లోనే స్పష్టత వస్తుందేమో చూడాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: