తెలుగు సినిమాల్లో మల్టీ స్టారర్ మూవీస్ తక్కువ. చూద్దామని  ప్రేక్షకులకు ఉన్నా కలసి నటించేందుకు మాత్రం హీరోలకు ఇగో ప్రాబ్లం. అందువల్ల ఎక్కువగా అవి రావు. ఇక రాజకీయాల్లోనూ అంతే చిల్లర మల్లర పార్టీలు కలసినంత సులువుగా రెండు పెద్ద పర్టీల మధ్యన పొత్తు కుదరదు. ఇక్కడా చాలా సమస్యలు ఉంటాయి. కానీ నెత్తిన పిడుగు పడుతుందంటే అంతా  ఒక్క చూరుకు చేరుతారు. మరి అలాంటి ఘటనలు తోసుకు వస్తేనే రాజకీయాలోనూ అంతా ఒక్కవుతారు.


భిన్న ధ్రువాలు :


ఏపీ రాజకీయాలు చూసుకుంటే చంద్రబాబు నీళ్ళ లాంటి వారు ఆయన ఎవరితోనైనా సర్దుకుపోగలా ఫక్త్ పొలిటీషియన్. ఆయనకు అవసరాల ముందు భేషజాలు ఏవీ గుర్తుకు రావు. ఇవాళ‌ బీజేపీతో విభేధించినా రేపటి రోజున మళ్ళీ కలవరని చెప్పలేం. ఇపుడు కాంగ్రెస్ తో కలసి పనిచేయడానికి కూడా బాబు ముందుకు వచ్చారంటేనే అర్ధం చేసుకోవాలి ఆయన రాజకీయం ఎలాంటిదో. భిన్న ధ్రువాలను సైతం కలపగల సత్తా బాబుకే ఉంది.


తూర్పు పడమర :


ఇక మరో రెండు రాజకీయ పార్టీలు ఏపీలో ఉన్నాయి. అవి వైసీపీ, జనసెన. ఈ రెండు పార్టీల అధ్యక్షులు జగన్, పవన్ లకు రాజకీయాలు పూర్తిగా వంటబట్టాయని అనుకోలేం. అందుకే వారు ఇంకా ఇగో దశలను దాటలేకపోతున్నారు. జగన్ విషయం తీసుకుంటే నా రూటే సెపరేట్ అంటారాయన. పవన్ ది ఇంకా సినీ హీరో తత్వమే. అందువల్ల ఈ ఇద్దరు నాయకులు తూర్పు, పడమరగా ఉంటున్నారు. అయితే ఈ రకమైన నాయకులే  ఇంకా బాగా సులువుగా కలిసిపోగలరని చరిత్ర  రుజువు చేస్తోంది.


కలిపే వీలుందా :


మరి ఇపుడు జరుగుతున్నది అదే. ఈ ఇద్దరూ కలవాలని తెర వెనక ఎన్నో శక్తులు గట్టిగానే పనిచేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఏపీలో బాబు ఓటమి కోరుకుంటోంది. జగన్, పవన్ వేరుగా పోటీ చేస్తే బాబు మళ్ళీ వచ్చినా రావచ్చును. అందువల్ల ఓట్లు చీలకుండా ఉండేందుకు ఈ ఇద్దరినీ కలిపేందుకు గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అటు వైసీపీలోను, ఇటు జనసేనలోనూ కూడా రెండు పార్టీలను కలిపేందుకు కొంతమంది ట్రై చేస్తున్నారుట. అంతేనా తెలంగాణా సీఎం కేసీయార్ కూడా రంగంలోకి దిగుతున్నారట. ఇక బీజేపీలోని కొన్ని పెద్ద తలకాయలు జోక్యం చేసుకుంటున్నాయట.


ఆ సినీ నిర్మాత నుంచి :


పవన్ కళ్యాణ్ జనసేనతో చేతులు కలపాలని వైసీపీకి చెందిన ఓ సినీ నిర్మాత గట్టిగా చెబుతున్నారట. ఈ విషయాన్ని ఆయన జగన్ దగ్గర కూడా ప్రస్తావించారట. ఏపీలో రెండు పార్టీలు కలిస్తే తిరుగు ఉండదన్నది గుంటూర్ కి చెందిన ఆ నిర్మాత నమ్మ‌కమట. ఇక జగన్ కుడి భుజం లాంటి విజయసాయి రెడ్డి కూడా ఈ పొత్తును సీరియస్ గానే పరిశీలిస్తునట్లుగా టాక్. జగన్ తో ఎలాగైన ఒప్పించి రేపటి ఎన్నికల్లో కలసి పోటీకి దిగాలన్నది ప్రయత్నమట. ఇప్పటికీ ఆయన జనసేన పట్ల సాఫ్ట్ గా ఉంటున్న సంగతి విధితమే.


సుసాధ్యమే :


ఈ పొత్తు సుసాధ్యమేనని రెండు పార్టీల నుంచి వినిపిస్తోంది. పవన్, జగన్ ఈ రోజుకు ఇలా ఉన్నా రేపటి ఎన్నికలు అవసరాల ద్రుష్ట్యా చేతులు కలుపుతారని అంటున్నారు. ఎట్టి పరిస్తితుల్లో చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కారాదని ఇద్దరూ అనుకుంటున్నారు. అదే కామన్ పాయింట్ ఇద్దరినీ కలుపుతుందని అంటున్నారు. ఆ మధ్యన జగన్ పవన్ పై ఘాటు విమర్శలు చేసినా మళ్ళీ ఒక్క మాట కూడా అనడంలేదు. పవన్ సైతం జగన్ తనకు శత్రువు కాదని ప్రకటించేశారు. చూడబోతే రేపటి ఎన్నికల్లో పొత్తు పొడిచే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: