గుంటూరు జిల్లాలో వైసిపి అసంతృప్త నేత, మాజీ ఎంఎల్ఏ లేళ్ళ అప్పిరెడ్డి షాకింగ్ డెసిషన్ తీసుకోనున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమిస్తున్నవారికి అవే అనుమాను మొదలయ్యాయి. వైసిపిలో ఇమడలేని లేళ్ళ టిడిపివైపే చూస్తున్నట్లు సమాచారం.  గుంటూరు వెస్ట్ నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్న లేళ్ళ స్ధానంలో ఈమధ్యే కొత్తగా చంద్రగిరి ఏసుపాదంను వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నియమించిన విషయం అందరికీ తెలిసిందే. మాజీ పోలీసు అధికారి అయిన ఏసుపాదంకు జగన్ ఏరికోరి మరీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుండి లేళ్ళలో తీవ్ర అసంతృప్తి మొదలైంది.

 

నిజానికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చేది లేదని జగన్ ఎప్పుడో లేళ్ళకు స్పష్టంగా చెప్పారట. కాకపోతే నియోజకవర్గ సమన్వయకర్తగా మాత్రం లేళ్ళనే కొనసాగించారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్టు వస్తుందన్న ధీమాతో లేళ్ళ కూడా పార్టీ కార్యక్రమాల్లో కొనసాగుతూనే ఉన్నారు. అయితే, హఠాత్తుగా లేళ్ళని మార్చేసి పెద్ద షాకే ఇచ్చారు. దాంతో అప్పటి నుండి లేళ్ళ మండిపోతున్నారు.

 

సమన్వయకర్తగా లేళ్ళను మార్చగానే నియోజకవర్గంలో గొడవలైనమాట వాస్తవం. దాంతో తెలుగుదేశంపార్టీ నేతలు లేళ్ళను అప్రోచ్ అయినట్లు సమాచారం. మాజీ మంత్రి, తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్, గురజాల ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాస్ అదే అదునుగా లేళ్ళకు గాలం వేసినట్లు తెలిసింది. వాళ్ళిద్దరితో లేళ్ళకు మొదటినుండి మంచి సంబంధాలే ఉన్నాయి లేండి. దాంతో లేళ్ళ కూడా సానుకూలంగా స్పందించారు.

 

వాళ్ళమధ్య చర్చల తర్వాత గుంటూరు వెస్ట్ లేదా బాపట్ల నియోజకవర్గాల్లో అసెంబ్లీ టిక్కెట్టిస్తే టిడిపిలో చేరటానికి అభ్యంతరం లేదని లేళ్ళ చెప్పారట. అదే విషయాన్ని ప్రస్తావించగా చంద్రబాబు కుదరదని చెప్పినట్లు సమాచారం. వెంటనే టిడిపిలో చేరి రేపటి ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత సముచితస్ధానం ఇస్తానంటూ లేళ్ళకు కబురు చేశారట చంద్రబాబు. అందుకు లేళ్ళ అంగీకరించలేదట. వైసిపిలో ఇమడలేకపోతున్న కారణంగా ఎక్కువ రోజులుండలేరని కాబట్టి టిడిపిలోకి లేళ్ళ తప్పక వచ్చేస్తారని అధికారపార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

 

లేళ్ళ వ్యవహారమే ఇపుడు జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టిచ్చే ఉద్దేశ్యం లేనపుడు జగన్ కూడా లేళ్ళను ఇంతకాలం సమన్వయకర్తగా కొనసాగించుండకూడదు. మొదట్లోనే ప్రత్యమ్నాయ నేతను చూసుకుని లేళ్ళను తప్పించేసుంటే సరిపోయేది. నాలుగున్నరేళ్ళు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు మోసిన తర్వాత ఒక్కసారిగా తప్పించేస్తే ఎవరికైనా మండుతుంది. అందులోను స్ధానికంగా కాస్త పట్టున్న లేళ్ళ లాంటి నేతకు మండకుండా ఉంటుందా ?


మరింత సమాచారం తెలుసుకోండి: