ముంద‌స్తు ముచ్చ‌ట‌కు తెర‌దీసిన తెలంగాణాలో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. అంతా ఒక‌వైపు.. కేసీఆర్ ఒక్క‌రు ఒక వైపు అన్న విధంగా రాజ‌కీయాలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. బీజేపీ ఒంట‌రిగానే పోటీ చేస్తున్నా.. దాని వ్యూహం కేసీఆర్‌ను గెలిపించ‌డ‌మే త‌ప్ప త‌మ‌ను తాము గెలిపించుకోవడం మాత్రం కాదు. ఏదేమైనా.. ఇప్పుడు మ‌హాకూట‌మి వ‌ర్సెస్ కేసీఆర్ అనే విధంగానే ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మ‌రి ఈ పోరులో ఆప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్ లెక్క‌లు ఏమ‌వుతాయి?  ఆయ‌న ఏవిధంగా నెగ్గుకు వ‌స్తారు?  లెక్క‌లు స‌రిపోతాయా? ఇవి గ‌త కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మెదులుతున్న ప్ర‌శ్న‌లు. దాదాపు తాము 100 సీట్లు గెలుస్తామ‌ని, త‌మ‌కు తిరుగులేద‌ని, ప్ర‌జ‌లంతా త‌మ‌వైపే ఉన్నార‌ని టీఆర్ ఎస్ నేత‌లు ప‌దే ప‌దే చెబుతున్నారు. 


ఒక‌రిద్ద‌రు నాయ‌కులు, కేసీఆర్ త‌న‌యుడు, కుమార్తె మ‌రో అడుగు ముందుకు వేసి.,. త‌మ‌కు 110 సీట్లు ఖాయ‌మ‌ని అంటు న్నారు. వాస్త‌వానికి 117 స్థానాలున్న తెలంగాణాలో గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను చూసుకుంటే.. ఉద్య‌మ వేడి సాగిన‌ప్పుడు, ఉద్యమంలో ప్ర‌జ‌లు త‌ల‌మున‌క‌లు అయిన‌ప్పుడు, కేసీఆర్‌ను దేవుడిగా భావించిన స‌మ‌యంలోనే ఇన్ని సీట్లు రాలేదు. మ‌రి ఇప్పుడు వ‌స్తాయా? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. కేసీఆర్ కానీ, ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు కానీ, కేసీఆర్ కుటుంబం కానీ.. ప్ర‌స్తుతం చెబుతున్న లెక్క‌ల‌కు క్షేత్ర‌స్థాయిలో ఎదుర‌వుతున్న లెక్క‌ల‌కు పొంత‌న లేకుండా పోయింద‌నేది వాస్తవం. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల్లో ఎన్ని మ్యాజిక్కులైన చేయొచ్చు-ఎన్నిక‌ల్లో మాత్రం ప్ర‌జ‌లే మ్యాజిక్ చేసి చూపిస్తారు! అనేది రాజ‌కీయాల్లో సామెత‌!


ఇప్పుడు ఈ సామెత‌నే తెలంగాణ ప్ర‌జ‌లు నిజం చేసి చూపించేందుకు రెడీ అవుతున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త చాలానే కూడ‌గ‌ట్టుకున్నారు కేసీఆర్‌. ముఖ్యంగా ప్ర‌జ‌ల్లో ఉండే నాయ‌కుడిని కోరుకున్న తెలంగాణా.. కు ఫామ్ హౌస్ నాయ‌కుడు దొరికాడ‌నే విప‌క్షాల ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ ప్ర‌చారం రిక్షా పుల్ల‌ర్ నుంచి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి వ‌రకు బాగానే చేరింది. దీంతో ఈ ప్ర‌భావం ఎన్నిక‌ల్లో క‌నిపిస్తుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. అదేస‌మ‌యంలో క‌ళ్ల అద్దాల ప‌థ‌కం కానీ, రైతుల‌కు ఉచిత విద్యుత్ కానీ, అంతా ఆయా వ‌ర్గాల‌ను సంతృప్తి ప‌ర‌చ‌లేదు. అదేవిధంగా విద్యార్థి లోకానికి ఎన్ని నోటిఫికేష‌న్లు ఇచ్చినా.. క్షేత్ర‌స్థాయిలో కేసీఆర్‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను మాత్రం తొల‌గించ‌లేక పోయారు. వెర‌సి ఆయా కార‌ణాలు టీఆర్ ఎస్ ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: