జనసేనలో చేరిన, చేరుతున్న నేతలను చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకూ జనసేనలో చేరిన నేతల్లో ఎవరి వల్లనైనా పార్టీకి ఉపయోగముందా ? అన్నదే పెద్ద ప్రశ్న. అప్పుడెప్పుడు నెల్లూరుజిల్లాకు చెందిన మాజీ ఎంఎల్సీ మాదాసు గంగాధర్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఈ మధ్యనే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముత్తా గోపాలకృష్ణ చేరారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన నేత నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక, తూగోజిల్లా నేత అయిన చలమలశెట్టి సునీల్ కూడా జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.  వీరు గాక రాష్ట్రంలోని జనాలకు కాస్త పరిచయమున్న నేతలు కూడా జనసేనలో ఉన్నారు లేండి. ఇక్కడే అందరిలోను ఓ ప్రశ్న మొదలైంది. ఇప్పటి వరకూ జనసేనలో చేరిన వారి వల్ల పార్టీకేమైనా ఉపయోగం జరుగుతుందా ?


మాదాసునే తీసుకుందాం. ఎప్పుడో దశాబ్దాల క్రితం ఓసారి ఎంఎల్సీగా చేశారు. నిజానికి మాదాసనే నేత ఉన్నారని జిల్లాలోనే చాలామంది మరచిపోయారు. ఏదో అప్పుడప్పుడు కాంగ్రెస్ లో కనిపిస్తుండేవారు. అటువంటి మాదాసును పవన్ ఏరికోరి పార్టీలోకి తీసుకుని పార్టీ వ్యూహకర్తగా నియమించారు. అంటే ఈయన వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదని తెలిసిపోతోంది. ఎక్కడైనా పోటీ చేస్తే పార్టీని చూసి ఓట్లేయాలే గానీ మాదాసును చూసి జనసేనకు ఓట్లేసే వారు ఉండరు.

 

ఇక, మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ  సంగతి కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. తూర్పు గోదావరి జిల్లాలో ఒకపుడు ముత్తాకు గట్టి నేతగానే పేరుండేది. కానీ ఇపుడైతే అవుడేటెడ్ నేతే అనటంలో సందేహం లేదు. ఆయన మారని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. కాబట్టి ఆయన వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం ఉండదని జిల్లా నేతలే చెబుతున్నారు. అదే సమయంలో మొన్ననే చేరిన నాదెండ్ల పరిస్దితి కూడా అంతే. నాదెండ్ల అవుడేటెడ్ నేత కాదు. కానీ పార్టీకి ఉపయోగపడే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. దశాబ్దాల కాంగ్రెస్ తో అనుబంధాన్ని తెంపుకుని జనసేనలో చేరారు. కాంగ్రెస్ గాలుంటేనే మనోహర్ గెలుస్తారు. అంతేకానీ పార్టీ గాలితో సంబంధం లేకుండా గెలవటం మనోహర్ కు సాధ్యం కాదు. రేపటి ఎన్నికల్లో కూడా జనసేన వల్ల మనోహర్ కు లాభమే కానీ మనోహర్ వల్ల జనసేనకు ఏమాత్రం ఉపయోగముండదనే అనుకోవాలి.


తాజాగా పార్టీలో చేరిన చలమలశెట్టి సునీల్ పొలిటికల్ ట్రాక్ రికార్డు కూడా ఏమంతా బావోలేదు. ఈయన మొదట ప్రజారాజ్యంపార్టీ ద్వారానే రాజకీయ అరంగేట్రం చేశారు. 2009లో ఓడిపోయారు. తర్వాత వైసిపిలో చేరి 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. తెలుగుదేశంపార్టీలో చేరేందుకు ప్రయత్నలు కూడా చేసుకున్నారు. చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారు. కానీ ఏమైందో తెలీదు కానీ హఠాత్తుగా జనసేనలో చేరారు. ఆర్ధికంగా స్ధితిమంతుడని పేరేకానీ నియోజకవర్గంలో పెద్ద పట్టులేదని సమాచారం. రేపటి ఎన్నికల్లో గెలిస్తే జనసేన పుణ్యమే కానీ సొంతంగా గెలిచే సత్తా ఉందని ఎవరూ అనుకోవటం లేదు. గుంటూరుకు చెందిన తోట చంద్రశేఖర్ పరిస్ధితి కూడా దాదాపు ఇంతే.


వీరుకాకుండా పార్టీలో పవన్ కోటరీ పేరుతో కొంతమంది కీలక వ్యక్తులున్నారు. వారిలో అత్యధికులకు జనాలతో ఏమాత్రం సంబంధం లేదు. ప్రత్యక్ష రాజకీయాలతో కూడా సంబంధం లేదు. కేవలం పవన్ కు సన్నిహితులన్న ఏకైక ముద్రతోనే పార్టీలో అధికారం చెలాయిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లిప్పిస్తామంటూ కొందరికి ఎవరికి వాళ్ళుగా హామీలిచ్చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. టిక్కెట్ల విషయంలో ఆధిపత్యం వల్లే గొడవలు పెరిగి రోడ్డున పడుతున్నాయి. అందుకనే వాళ్ళ విషయంలో పవన్ కూడా బహిరంగంగానే స్పందించాల్సొచ్చిందంటేనే అర్ధమవుతోంది కోటరి ప్రభావమెంతుందో ? కాబట్టి ఇప్పటి వరకూ  చేరిన వాళ్ళ వల్ల ఏమీ ఉపయోగం ఉండదని అర్ధమవుతోంది. ఇక, చేరబోయే వాళ్ళ వల్ల అయినా జనసేనకు ఉపయోగం ఉంటుందో చూడాల్సిందే.  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: