పవన్ కళ్యాణ్  ప్రముఖ సినీ నటుడు. పైగా యూత్ ఐకాన్. ఆయన ఎక్కడ ఉన్నా  జనాలు విపరీతంగా వస్తారు. ఇక ఆయనే స్వయంగా రావాలని పిలుపు ఇస్తే లక్షలాదిగా తరలివస్తారు. అది ఆయన హీరోయిజం. అయితే అదే రాజకీయామని  భావిస్తే మాత్రం తప్పులో కాలేసినట్లే. ధవలేశ్వ‌రం వంతెన వద్ద పవన్ జన కవాతుని అలాగే చూడాలి.


అధికారంలోకి వచ్చేస్తారా :


ఇక్కడ జన కవాతుకు లక్షలాదిగా జనం వచ్చారని అన్ని రిపోర్టులూ చెబుతున్నాయి. బాగానే ఉంది. ఆ జనాన్ని చూసిన పవన్ ఆవేశంలో చాలా మాటలే చెప్పారు. వచ్చేది జనసేన ప్రభుత్వమేనని కూడా ధీమా వ్యక్తం చేశారు. జానాలు వచ్చేసినంత మాత్రాన అధికారం దక్కినట్లేనా. పవన్ స్పీచ్ చూస్తే అదే అనిపిస్తోంది. 


రెండు దిగ్గజాలు :


ఏపీలో సీన్ చూస్తే రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి. అవి అలా ఇలా లేవు. భారీ సరంజామాతో ఇరు వైపులా  మోహరించి ఉన్నాయి. పైగా రెండింటికీ 40 శాతం తక్కువ కాకుండా ఓటు బ్యాంక్ కూడా ఉంది. బూత్ లెవెల్ నుంచి సంస్థాగత నిర్మాణం కూడా ఉంది. వార్డు మెంబర్ నుంచి ఎంపీల వరకు ఆ రెండు పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. మరి వాటిని ఢీ కొట్టడం అంటే కవాతులు పెట్టినంత ఈజీనా


నిర్మాణం ఏదీ :


పార్టీ అంటే కాగితాల మీద ఉండదు. సభల్లోనూ ఉండదు. జనాల్లో ఉండాలి. ఇప్పటికైతే జనంలో కనిపించే వినిపించే ఒకే ఒక్క పేరు పవన్ కళ్యాణ్  మాత్రమే. ఆయన నాయకులను తయారు చేయకుండా, పార్టీ నిర్మాణం ఊసే లేకుండా ఏళ్ళకు ఏళ్ళు గడిపేశారు. ఇపుడు ఎన్నికలు తరుముకొస్తున్న వేళ జనాలతో మీటింగులు పెట్టి అధికారంలోకి వస్తామని గట్టి మాటలు చెబుతున్నారు. అది సాధ్యమేనా అంటే రాజకీయం తెలిసిన వారు ఎవరైనా కాదు అనే చెబుతారు.


రాయబేరాలకేనా :


రేపటి ఎన్నికల్లో పవన్ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుందో  తెలియదు, ఎక్కడ బలం, బలహీనతలు ఉన్నాయో కూడా తెలియదు ఇటువంటి టైంలో కవాతులు పెట్టడం అంటే పొత్తుల కోసం సీట్ల రాయ బేరాలకు తెర తీసేందుకేనా అన్న డౌట్లు వస్తున్నాయి. పైగా తాము ఎవరికీ శత్రువులం, మిత్రులం కాదని పవన్ పదే పదే చెప్పుకొస్తున్నారు. అంటే రేపటి ఎన్నికల్లో అడిగినన్ని సీట్లు వైసీపీ, టీడీపీ ఎవరు ఇచ్చిన పొత్తు పెట్టుకోవడానికేనా జనసేన కవాతు పేరిట బల ప్రదర్శన నిర్వహించిందన్న అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఇల్లు అలకగానే పండుగ వచ్చినట్లు కాదు అంటారు, అలా సభ పెట్టినంత మాత్రాన అధికారమూ రాదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: