జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీచ్ విన్నవారికి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నట్లే ఉంది. ఇంతకాలం చంద్రబాబునాయుడు, నారా లోకేష్ అండ్ కో పై జగన్, వైసిపి నేతలు చేస్తున్న ఆరోపణలనే తాజాగా పవన్ కూడా మొదలుపెట్టారు. చంద్రబాబుపై ఆరోపణలు ఈ నాటివి కావు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అవినీతి పెరిగిపోయింది. అప్పటి నుండి చంద్రబాబు అవినీతిని లక్ష్యంగా చేసుకుని జగన్ అండ్ కో ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినవే.


అప్పట్లో చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడిన పవన్ వైసిపి అధ్యక్షునిపై విరుచుకుపడేవారు. ప్రభుత్వ వైఫల్యాలన్నింటికీ చంద్రబాబు కారణమైతే పవన్ మాత్రం విచిత్రంగా జగన్ ను నిందించేవారు. చంద్రబాబు అండ్ కో అవినీతి కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నా పవన్ కు మాత్రం అప్పట్లో అవేవి కనిపించలేదు. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని కాగ్ నిర్ధారించినా పవన్ మాత్రం చంద్రబాబును వెనకేసుకొచ్చారు.

 

తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో ? మెల్లిగా చంద్రబాబు నుండి పవన్ దూరంగా జరిగారు. అయినా సరే వారిద్దరి బంధంపై జనాల్లో అనుమానాలు పోలేదు. మొత్తానికి ఈమధ్య కాలంలోనే చంద్రబాబుపై పవన్ పూర్తిస్ధాయిలో విరుచుకుపడుతున్నారు. చూడబోతే తన శీలాన్ని నిరూపిచుకునేందుకే చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా చేసుకుని పవన్ ఆరోపణలు, విమర్శలు పెంచేస్తున్నారు. రాజమండ్రి బహిరంగ సభలో కూడా జరిగిందే.


అదే సమయంలో జగన్ అంటే తనకేమీ కోపం లేదని పవన్ చెప్పటం గమనార్హం. ఎప్పుడైతే చంద్రబాబు, లోకేష్ ను పవన్ టెర్గెట్ చేసుకోవటం మొదలుపెట్టారో అప్పటి నుండి జగన్ పై ఆరోపణలు, విమర్శలను తగ్గించేశారు. అదే సమయంలో జగన్ కు పవన్ కాస్త అనుకూలంగా మాట్లాడుతుండటంతో పలువురిలో అనుమానాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో జగన్, పవన్ కలిసి పోటీ చేస్తారనే ప్రచారానికి పవన్ మాటలు ఊతాన్నిస్తోంది. రెండు పార్టీల్లోని కొందరు నేతలు ఈనెల 23, 24 తేదీల్లో ఇదే విషయమై భేటీ అవుతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. మరి అందులో ఎంత వరకూ నిజముందో చూడాల్సిందే .


వచ్చే ఎన్నికల్లో జగన్, పవన్ కలిసి పనిచేయాలని రెండు పార్టీల్లోని కొందరు నేతలకు ఆలోచన ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దానికి తోడు చంద్రబాబు వ్యతిరేక ఓటు చీలకుండా బిజెపిలోని కొందరు జాతీయ నేతలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవేళ వాళ్ళ ప్రయత్నాలు గనుక సఫలమై ఇద్దరు నేతలు కలిసి 2019 ఎన్నికలను ఎదుర్కొంటే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవన్నది ఓ అంచనా. మరి  ఏం జరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: