పార్టీ వర్గాల సమాచారం ప్రకారం జరుగుతున్న ప్రచారం నిజమే. అందులో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ఎందుకంటే, దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన గల్లా కుటుంబం తప్పని పరిస్ధితుల్లో మాత్రమే తెలుగుదేశంపార్టీ కండువా కప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్దితిని గమనించిన గల్లా కుటుంబం వేరే దారిలేక టిడిపిలో చేరారు. అదికూడా కొడుకు గల్లా జయదేవ్ రాజకీయ అరంగేట్రాన్ని దృష్టిటో పెట్టుకునే అన్న విషయంలో సందేహం లేదు.

 

వ్రతం చెడ్డా ఫలితం దక్కిందన్న పద్దతిలో చంద్రగిరిలో తానోడిపోయినా గుంటూరు ఎంపిగా జయదేవ్ గెలవటంతో కాస్త ఊరట లభించింది. కానీ ఆ తర్వాత చంద్రగిరిలో జరిగిన పరిణామాలే గల్లాను బాగా ఇబ్బంది పెట్టాయి. చంద్రగిరి ఇన్చార్జిగా గల్లాను పార్టీలో నేతలెవరూ ఒప్పుకోలేదు. కార్యకర్తల్లో పట్టులేదు. దాంతో కాంగ్రెస్ లో ఉన్నపుడు ఆమెకు మద్దతుగా నిలబడ్డవారితోనే టిడిపిలోకూడా నెట్టుకురావాల్సొచ్చింది. దాంతో టిడిపి నేతలకు, కాంగ్రెస్ నుండి టిడిపిలో చేరిన నేతలకు మధ్య ఆధిపత్య పోరాటాలు మొదలయ్యాయి.


దాంతో పార్టీ కార్యక్రమాల్లో గల్లాకు పోటీగా టిడిపి నేతలు విడిగా కార్యక్రమాలు పెట్టుకోవటం మొదలుపెట్టారు. పోటీ కార్యక్రమాలతో గల్లాకు మరింత అవమానాలు మొదలయ్యాయి. చంద్రబాబునాయుడుకు చెప్పినా ఉపయోగం లేకపోయింది. దాంతో అరుణకు కష్టాలు పెరిగిపోయాయి. దాంతో ఇక లాభం లేదనుకుని నియోజకవర్గ ఇన్చార్జిగా తప్పించమని ఏకంగా చంద్రబాబుకే చెప్పేశారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రెండు రోజుల క్రితం రూరల్ మండలంలోని ఓ ఫంక్షన్ హాలులో తన మద్దతుదారులతో మాట్లాడుతూ పార్టీలో ఎదురవుతున్న అవమానాలను చెప్పుకుని గల్లా భోరుమని ఏడ్చేశారట.

 

చంద్రబాబుతో తాను, జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, మంత్రి అమరనాధ్ రెడ్డికి మధ్య జరిగిన సంభాషణలను కూడా చివరకు మీడియాకు లీక్ చేసి తనను అవమానాలకు గురిచేస్తున్నట్లు కంటతడిపెట్టుకున్నారట. తన కారులో తిరుగుతూ, తనతోనే ఉంటూ కొందరు నేతలు తనకు ద్రోహం చేశారని చేసిన వ్యాఖ్యలు జిల్లాలో సంచలనంగా మారాయి. గల్లా ఎవరి పేరు చెప్పకపోయినా ఆమె ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేశారో అందరికీ అర్ధమైపోయింది. మారుతున్న రాజకీయ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి టిడిపిలో ముసలం తప్పేట్లైలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: