హాట్ కామెంట్స్ చేయడంలో పవన్ రాటుదేలుతున్నారు. పదునైన పంచుల‌తో అదరకొడుతున్నారు. ఎక్కడ ఎలా గుచ్చేయాలో గురి చూసి మరీ పవన్ బాణాలు వేస్తున్నారు. ఓ విధంగా అధికార పార్టీ నాయకులకు పవన్ విమర్శలు తట్టుకోలేనివిగా మారుతున్నాయి. పవన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక తికమక పడుతున్నారు.


కాటన్ బ్యారేజ్ గట్టిది :


పాపం ఎక్కడున్నాడో కానీ మహానుభావుడు కాటన్ కట్టిన బ్యారేజ్ బహు గట్టిది. అందువల్లనే లక్షలాది మందితో కవాతు చేసినా ఎక్కడ చెక్కుచెదరలేదు. అదే మన బాబు గారి పోలవరం అయ్యుంటేనా అంటూ పవన్ లేటెస్ట్ గా చేసిన ఈ కామెంట్స్ కాక రేపుతున్నాయి. పోలవరం నాణ్యతపై పవన్ అనుమానాలు వ్యక్తం చేయడమే కాదు, ముడుపులు తీసుకుని కడుతున్నారంటూ ఘాటైన  ఆరోపణలు గుప్పించారు. ఇదే తీరున నాడు కాటన్ కూడ చేసి ఉంటే ఆ బ్యారేజ్ ఆయుష్షు ఇన్నాళ్ళు ఉండేదా అని పవన్ ప్రశ్నించడం విశేషం.


చొక్కాలు పట్టుకోవడానికే :


కవాతు ఎందుకోసం, , దేనికోసం అని తెలుగుదేశం నాయకులు అడగడంపై పవన్ ఫైర్ అవుతున్నారు. మీ చొక్కాలు పట్టుకోవడానికే ఈ కవాతు అంటూ తనదైన  స్టైల్లో జవాబు చెప్పారు. సరిగా పాలించని  నాయకులను నిలదీయడానికే  కవాతు పెట్టామని, ఇది బల ప్రదర్శనకు కాదని, భావజాల బలం కోసమేనని వివరణ ఇస్తున్నారు. ఎక్కడ చూసిన అవినీతి తప్ప అభివ్రుద్ధి లేని, తెలియని నాయకులను ఎండగట్టడానికే కవాతు అంటూ పవన్ పసుపు పార్టీపై మండిపడ్డారు.


పంచెలోనేనట :


తాను ఇకపై పంచె కట్టుతోనే జనంలో ఉంటానని పవన్ అంటున్నారు. కవాతులో పంచె కట్టుతో కనిపించిన తాను ఇకపై దానే కంటిన్యూ చేస్తానని కూడా ఆయన చెబుతున్నారు. అంటే ఇన్నళ్ళూ లాల్చీ పైజామా, జీను ప్యాంటులలో కనిపించిన పవన్ ఇకపై పంచెతోనే దర్శనం ఇస్తారన్న మాట. కవాతు విజయవంతం కావడంతో హుషార్ మీద ఉన్న పవన్ రేపటి రోజున కష్టపడితే రాజ్యం మనదేనంటూ కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: