ఇంత కాలానికి చంద్రబాబునాయుడు విషయంలో కెసియార్ ఓ స్పష్టతను ఇచ్చారు. అదేమిటంటే, చంద్రబాబు వేరు, ఆంధ్రప్రజలు వేరని. చంద్రబాబును అంటే ఆంధ్ర ప్రజలను అన్నట్లు కాదట. చంద్రబాబునంటే కేవలం చంద్రబాబును మాత్రమే అన్నట్లు అంటూ కెసియార్ స్పష్టత ఇచ్చారు. ఇంతకీ చంద్రబాబు, ఆంధ్ర ప్రజలు అంటూ అంత వివరంగా కెసియార్ ఎందుకు మాట్లాడినట్లు ?  ఎందుకంటే, తనకు వ్యతిరేకంగా ఏమి జరిగినా, తెలుగుదేశంపార్టీ నేతలకు ఏమి జరిగినా ఏపి మీద దాడి, ప్రజాస్వామ్యంపై దాడి అంటూ చంద్రబాబు ఊరికే గగ్గోలు పెట్టేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

 ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన దగ్గర నుండి తనను, కొడుకు లోకేష్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు బహిరంగ వేదికలపైనే చాలా సార్లు చెప్పారు. అంతే కాకుండా తనను ఇబ్బందులు పెట్టటానికి కేంద్ర దర్యాప్తు సంస్ధలతో దాడులు చేయించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోందంటూ పదే పదే చెప్పారు. దాడులను ఎదుర్కోవటానికి ముఖ్య నేతలంతా రెడీగా ఉండాలంటూ పార్టీ సమావేశాల్లో కూడా చెప్పారు. దానికి తగ్గట్లే కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మరో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్,  ఎంఎల్ఏ పోతుల రామారావు, బీద మస్తాన్ రావుపై ఐటి, ఈడీ దాడులు జరిగాయి. అంతుకుముందే టిడిపికి మద్దతుదారులుగా ఉన్న అనేకమంది వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలపై దాడులు జరిగాయి.

 

ఎప్పుడైతే టిడిపి ముఖ్యనేతలు, మద్దతుదారులపై దాడులు మొదలయ్యాయో చంద్రబాబు మొదలు క్రిందిస్ధాయి నేతల వరకూ దాడులకు వ్యతిరేకంగా ఎంత గోల  చేశారో అందరూ చూసిందే. ఐటి దాడులు జరిగిన నేతలందరి మీద అత్యంత అవినీతి ఆరోపణలున్నాయి. వారి మీద దాడులు మొదలయ్యాయో లేదో ఏపి ప్రజల మీద దాడని, ప్రజాస్వామ్యంపై దాడంటూ గోల గోల చేసేశారు. తమకు మద్దతుగా నిలబడే మీడియా ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్రప్రభుత్వంపై మాటలతో  పెద్ద యుద్దమే చేశారు.

 

ఇదే టిడిపిలో ఒకపుడు ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఎంఎల్ఏ శ్రీనివాసరావు తదితులపై ఐటి, సిబిఐ దాడులు జరిగినపుడు చంద్రబాబు కానీ లోకేష్ కానీ సిఎం రమేష్, సుజనా చౌదరి కానీ ఎవరూ నోరుకూడా విప్పలేదు. సుజనా, సిఎం రమేష్, బీదమస్తాన్ లపై దాడులు జరిగినపుడే ఎందుకు గలో చేశారు ? అంటే వాళ్లంతా చంద్రబాబుకు బినామీలంటూ విపరీతమైన ప్రచారం జరుగుతోంది. బహుశా ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు వేరు, ఏపి ప్రజలు వేరని కెసియార్ స్పష్టం చేసుంటారు.  


సరే, రాజకీయాలన్నాక అనేక ఆరోపణలు, విమర్శలు మామూలే. ఆ విధంగానే కెసియార్ కూడా చంద్రబాబుపై పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఓటుకునోటు కేసులో దొరికిన దొంగన్నారు. తెలంగాణాలో ఆంద్రప్రజలకు చంద్రబాబు పెద్ద శని అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణాను చంద్రబాబు వదిలేసిన తర్వాత మత కలహాలు, పేకాట క్లబ్బులు, శాంతి భద్రతలు అన్నీ నియింత్రణలోకి వచ్చేశాయంటూ ధ్వజమెత్తారు. ఏపిలో మ్యానిఫెస్టోను చక్కంగా అమలు చేయలేని వ్యక్తి తెలంగాణ గురించి మాట్లాడటమా ? అంటూ ఎద్దేవా చేయటం గమనార్హం. చంద్రబాబు ఒక వ్యక్తని, పైగా రాజకీయ నేత కాబట్టి ఎన్ని ఆరోపణలు, విమర్శలైనా చేస్తామంటూ సమర్దించుకోవటం విచిత్రంగా ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: