వైసిపి  అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు చంద్రబాబునాయుడు ఫిరాయింపులను ప్రోత్సహించిన విషయం అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను టిడిపిలోకి లాక్కున్నారు. వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించాలంటే ఎందుకు వస్తారు ? అందుకే వారిని రకరకాలుగా ప్రలోభాలకు గురిచేశారు. కొందరికి మంత్రిపదవులు, మరికొందరికి అప్పులు తీర్చి, కాంట్రాక్టులు కట్టబెట్టటం, మరికొందరికి డబ్బులు ముట్టచెప్పటం ఓ భాగం.

 

ఏదేమైనా మొత్తం మీద ఫిరాయింపుల వ్యవహారంలో వందలాది కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది వాస్తవం. తీసుకున్నది ఫిరాయింపు ఎంఎల్ఏలన్నది తెలుస్తోంది. మరి ఎవరెవరికి ఎంతిచ్చారు ? ఇచ్చింది ఎవరు ? ఆ డబ్బు ఎక్కడి నుండి ? ఎలా సర్దుబాటు చేశారు ? అనేవి ఇంతకాలం సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. టిడిపి నేతలపై అనుమానాలున్నా, ఆరోపణలు వినిపిస్తున్న వాటికి పక్కా ఆధారాలైతే లేవు. కానీ తాజాగా తెలుగుదేశంపారీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పై ఐటి దాడులు జరిగిన తర్వాత ఫిరాయింపుల డొంకంతా కదులుతోంది.

 

ఫిరాయింపులకు ముట్టచెప్పిన డబ్బంతా సిఎం రమేష్ కంపెనీల నుండే వచ్చిందనే అనుమానాలకు బలం చేకూరుతోంది. ఎలాగంటే రిత్విక్ ప్రాజెక్ట్స్, రిత్విక్ ప్రాపర్టీస్ సంస్ధల నుండి వందల కోట్ల రూపాయలు బయటకు తరలిపోయిందని ఐటి అధికారులు గుర్తించారు. రమేష్ పెట్టిన 10 డొల్ల కంపెనీల్లోకే పై రెండు సంస్ధల డబ్బు చేరిందని ఐటి అధికారులు అంచనా వేస్తున్నారు.


దానికితోడు డొల్ల కంపెనీల నుండి బయటకు వెళ్ళిన సొమ్మంతా డబ్బు రూపంలోనే బ్యాంకుల నుండి తీసుకెళ్ళిపోయారట. అలా బయటకు వెళ్ళిపోయిన వందల కోట్ల రూపాయలు మళ్ళీ ఎక్కడా జమకాలేదు. ఇక్కడే ఐటి అధికారుల అనుమానాలు బలపడుతున్నాయి. దానికితోడు తనకు టిడిపి నుండి రూ 12 కోట్ల రూపాయలు ముట్టిందని మావోయిస్టుల  చేతిలో హత్యకు గురయ్యే ముందు స్వయంగా అరకు ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావే చెప్పారు. అంతేకాకుండా మరో ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరికి రూ 20 కోట్లు అందినట్లు కిడారి తమతో చెప్పారని మావోయిస్టుల లేఖలో స్పష్టంగా చెప్పారు.


అంటే ఇక్కడ అర్ధమవుతోందేమిటంటే ఒక్కో ఫిరాయింపు ఎంఎల్ఏకు ఒక్కో ధర కట్టారు. ఆమధ్య కోడుమూరు ఫిరాయింపు ఎంఎల్ఏ మణిగాంధి మాట్లాడుతూ టిడిపిలోకి ఫిరాయించినందుకు తామందరమూ డబ్బులు తీసుకున్నట్లు చెప్పారు.  సో, ఫిరాయింపులకు ఇచ్చిన డబ్బంతా లెక్కలో లేని డబ్బే అని అర్ధమవుతోంది. ఆ డబ్బంతా తన కంపెనీల నుండి రమేషే  సర్దుబాటు చేశారనే అనుమానాలు బయటపడుతున్నాయి. దాంతో త్వరలోనే ఫిరాయింపుల బండారం. కీలక వ్యక్తుల బండారం బయటపడే అవకాశాలున్నాయనే అందరూ అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: