టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే, కొద్ది రోజులుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నారా ? కృష్ణయ్యకు కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు ఇచ్చిన హామీలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారా ? త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారా ? అంటే తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కేసీఆర్‌ను గద్దె దింపాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే టీడీపీ, సీపీఐ, తెలంగాణ మహజనసమితితో మహాకూటమి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మహాకూటమి ఏర్పాట్లలో సీట్ల పంపిణీపై ఓ పక్కన చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో సెటిలర్లతో పాటు బీసీ ఓటు బ్యాంక్‌పైన ప్రధానంగా దృష్టి సారించిన కాంగ్రెస్‌ బీసీ ఓట్లను గంపగుత్తగా తమ వైపునకు తిప్పుకునే క్రమంలో ఆర్‌. కృష్ణయ్యపై వల వేసింది. 


ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్‌. కృష్ణయ్యను పార్టీలో చేర్చుకోవాలన్న ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే కృష్ణయ్యతో టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల‌ ఇన్‌చార్జ్‌ ఆర్‌. కుంతియా చర్చలు జరిపారు. కాంగ్రెస్‌లో చేరేందుకు దాదాపు సుముఖ‌త వ్యక్తం చేసిన కృష్ణయ్య ముందుగా తన కుమారుడికి సీటు ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. కృష్ణయ్య ఇప్పటి వరకు తాను ప్రాధినిత్యం వహించిన ఎల్‌బీ నగర్‌ సీటుపై దృష్టి పెట్టగా కాంగ్రెస్‌ నాయకులు మాత్రం అక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారని.... మరేదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హామి ఇచ్చినట్టు తెలిసింది. 


అలాకాని పక్షంలో వచ్చే ఎన్నికల్లో గెలిచాక ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి సైతం ఆఫర్ చేశారని సమాచారం. నిన్నటి వరకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన టీడీపీ తీరుపై కాంగ్రెస్‌ నేతల వద్ద అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీ ఇచ్చిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేదని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలతో భేటి అయ్యే ముందు కృష్ణయ్య బీసీ పార్టీ పెట్టాలని ఆనుకున్నా... ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్లడం సాధ్యం అయ్యే పరిస్థితిలో లేకపోవడంతో చివరకు ఆయన బీసీ సంఘాల ప్రతినిధులతో చర్చించి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తే ఎలా ఉంటుందా అన్న సమాలోచనలు జరిపినట్టు తెలిస్తోంది. ఏదేమైనా ఆర్‌. కృష్ణయ్య సైతం కాంగ్రెస్‌లోకి వెళ్లి ఆ పార్టీ తరపున పోటీ చేసినా, ప్రచారం చేసినా తెలంగాణలో ఎన్నికల సమరం రంజుగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: