ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు హైదరాబాద్ ఎంపి చాలెంజ్ విసిరారు. జాతీయ పార్టీల జాతీయ అధ్యక్షులిద్దరు దేశవ్యాప్తంగా పర్యటనలు చేయటం కాదని దమ్ముంటే హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తనపై పోటీ చేసి గెలవాలంటూ సవాలు విసరటం విచిత్రంగా ఉంది. ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణాలో పర్యటిస్తున్న రాహూల్ ను ఓవైసి మరీ తీసిపారేసినట్లు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది.

 

ఆదిలాబాద్, కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభల తర్వాత హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర జరిగిన రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఓవైసి రాహూల్ పై కామెంట్  చేశారు. రాహూల్ , అమిత్ షాలను ఉద్దేశించి ఓవైసి చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ గా మారింది.  చార్మినార్ కు వస్తున్న నేపధ్యంలో రాహూల్ కు స్వాగతం చెప్పారు. హైదరాబాద్ నగరం అందరినీ గౌరవిస్తుందన్నారు. రాహూల్ తో పాటు అమిత్ కూడా ఇక్కడి నుండి పోటీ చేయాలని ఓవైసి కోరుకున్నారు. భిన్న జాతుల సంస్కృతి అంటే ఏమిటో ఇక్కడి ప్రజలు ఇద్దరు జాతీయ నేతలకు రుచి చూపిస్తారంటూ ఎద్దేవా చేశారు. దోస్తులైనా, శతృవులైనా హైదరాబాద్ ఇద్దరికీ స్వాగతం పలుకుతుందంటూ ఓవైసి చేసిన ట్వీట్ లో ఎగతాళే కనబడుతోంది.


ఎలాగంటే, ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలిలో పోటీ చేసే రాహూల్ తెలంగాణాలోని హైదరాబాద్ కు వచ్చి ఎందుకు పోటీ చేస్తారు ? అదే విధంగా గుజరాత్ రాష్ట్రీయుడైన అమిత్ షా హైదరాబాద్ నుండి పోటీ చేసే అవకాశమే లేదు. ఆ విషయాలు ఓవైసికి అంత మాత్రం తెలీదా ? రాయబరేలిలోనో లేకపోతే గుజరాత్ లోనో ఓవైసి పోటీ చేసి గెలవగలరా ? ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు  లేదా ఇప్పటి తెలంగాణాలో కావచ్చు పాలకులు  చేసిన తప్పిదాల వల్లే ఓల్డ్ సిటీలో ఎంఐఎం పాతుకుపోయిందన్నది వాస్తవం. పాలకులు సక్రమంగా ఉండుంటే ఓవైసిల పరిస్దితి ఇంకో విధంగా ఉండేదనటంలో సందేహం లేదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: