జగన్ రాజకీయంగా తప్పుటడుగులు వేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి మరీ ఎక్కువైపోయింది. పార్టీకి జనాదరణ పెరుగుతున్న టైంలో అదను చూసి మరీ తప్పుడు వ్యూహాలను అనుసరిస్తున్నారు. తేరుకునిలోగానే అతి పెద్ద డ్యామేజ్ జరిగిపోతోంది. లేటెస్ట్ గా జగన్ మరో తప్పులో కాలేశారు. దానికి బాధ్యత మాత్రం ఆయనది కాదు, సీనియర్లదని చెబుతున్నారు.


తిత్లీని తక్కువ అంచనా :


తిత్లీ తుపానును వైసీపీ నేతలు తక్కువ అంచనా వేశారు. అదేమంత పెద్దది కాదని వారు అనుకున్నారు. అనుకోవడమే కాదు. జగన్ కి కూడా అదే చెప్పారట. పాదయాత్ర మానుకుని మీరు అక్కడికి రావల్సినంత కానేకాదని కూడా చెప్పారు. దాంతో జగన్ ఊరుకుండిపోయారట. అయితే తిత్లీ తుపాను ఇలా వెళ్ళగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అలా దిగిపోయి ఏకంగా సహాయ కార్యక్రమాలు చక్కబెడుతూనే రాజకీయం స్టార్ట్ చేశారు ఇది వైసీపీని దారుణంగా దెబ్బ కొట్టింది.


డ్యామేజ్ చేసిన బాబు:


పక్క జిల్లాలోనే ఉంటూ ఇక్కడ జనం చచ్చిపోతూంటే పట్టించుకోని జగన్ రాజకీయాలకు అనర్హుడు అంటూ చంద్రబాబు చేసిన హాట్ కామెంట్స్ వైసీపీకి ఎక్కడ తగలాలో అక్కడే తగిలాయి. అప్పటికే చాలా నష్టం రాజకీయంగా  వైసీపీకి  జరిగిపోయింది.ఆయనకు  కోర్టులకు వెళ్ళడానికి సెలవు దొరుకుతుంది, వెళ్ళకపోతే జైల్లో వేస్తారంటూ బాబు పంచులు కూడా పేల్చారు. జగన్ ముద్దులు పెడుతూ పాదయాత్రలో బుర్రలు నిమురుతూ నడవడం కాదు. మనసుంటే తిత్లీ బాధితులను చూసేందుకు రావలంటూ బాబు చేసిన విమర్శలతో వైసీపీ విల‌విల్లాడింది. ఇక మంత్రులు కూడా అదే వరసలో ఆడిపోసుకున్నారు.


ఆ ఇద్దరు మాజీ మంత్రులేనట :


జగన్ శ్రికాకుళం రాకపోవడానికి ఓ ఇద్దరు మాజీ మంత్రులు కారణమని చెబుతున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరవు జగన్ రానవసరం లెదన్నట్లుగా సలహాలు ఇవ్వడంతోనే జగన్ నమ్మేసి ఉండిపోయారని అంటున్నారు. ఇపుడు చంద్రబాబు ఆరోపణల తరువాత వెళ్ళినా ఉపయోగం ఉండదని భావించిన జగన్ తన శ్రీకాకుళం టూర్లోనే మార్పులు చేసుకుంటున్నారు. మొత్తం తిత్లీ బాధితులు  ఉన్న ప్రాంతాలన్నీ తిరిగేలా రూట్ మ్యాప్ ఖరార్ చేసుకుంటున్నారు. మొత్తానికి సీనియర్ల సలహాతో వైసీపీ సూప్ లో  పడిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: