కొంతమంది తమను తాము చాలా పెద్ద రాజకీయ నేతలమని అనుకుంటుంటారు. రాజకీయాల్లో ఏ పార్టీలో పనిచేసినా, జిల్లాలో అందరికీ తెలిసిన వ్యక్తే అయినా వాళ్ళ ప్రభావం మాత్రం శూన్యమనే చెప్పాలి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చలమలశెట్టి సునీల్ అటువంటి కోవలోకే వస్తారు.  పదేళ్ళ క్రితమే రాజకీయాల్లోకి అడుగుపెట్టినా ఇప్పటి వరకూ జిల్లాలో కానీ ఏ పార్టీలో కానీ ఎవరి మీదా ప్రభావం చూపలేకపోయారు. తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకోవటంతోనే సునీల్ తో అందరికీ సమస్యలు వస్తున్నాయన్నది అర్ధమైపోతోంది.

 

2009లో ప్రజా రాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సరే అప్పట్లో కాకినాడ లోక్ సభ స్ధానానికి పోటీ చేసి పళ్ళంరాజు చేతిలో  ఓడిపోయారు. ఎప్పుడైతే పిఆర్పిని కాంగ్రెస్ లో కలిపేశారో సునీల్ కొంత కాలం స్తబ్దుగా ఉన్నారు. ఆ తర్వాత వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి టిడిపి  అభ్యర్ధి తోట నర్సింహం చేతిలో నాలుగు వేల ఓట్ల తేడాతో మళ్ళీ ఓడిపోయారు. 2019లో మూడోసారి పోటీ చేయటం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. ఎంపిగా గెలవాలన్న కోరికలో తప్పులేదు కానీ దాన్ని ఎలా సాకారం చేసుకోవాలో అర్ధం కావటం లేదు.

 

నిజానికి సునీల్ ఏ పార్టీలోను లేరన్నది వాస్తవం. ఒకేసారి రెండు కాదు మూడు పడవల్లో కాళ్ళు పెట్టాలన్న సునీల్ ఆలోచనే చేటు తెస్తోంది. మొన్నటి వరకూ వైసిపిలో ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో తనకు ఎంపి టిక్కెట్టు ఇవ్వటంతో పాటు తాను చెప్పిన మరో ముగ్గురికి అసెంబ్లీ టిక్కెట్లివ్వాలని సునీల్ కండీషన్లు పెట్టారట. సునీల్ కండీషన్లు చూసిన జగన్ ముందు ఆశ్చర్యపోయి తర్వాత సునీల్ నే దూరం పెట్టేశారు. దాంతో సునీల్ కూడా వైసిపికి రాజీనామా చేసేశారు.

 

తర్వాత సునీల్ చూపు తెలుగుదేశంపార్టీపైన పడింది. అప్పటికే సునీల్ తమ్ముడు టిడిపిలో ఉన్నారట. అందుకనే తమ్ముడి ద్వారా టిడిపిలో చేరాలనుకున్నారు. అమరావతికి వచ్చి చంద్రబాబునాయుడుతో చాలాసార్లు భేటీ అయ్యారు. ఇక రేపో మాపో సైకిల్ ఎక్కటమే మిగిలిందనుకుంటున్న సమయంలో హఠాత్తుగగా జనసేన కార్యాలయంలో తేలారు. విషయం ఏమిటని ఆరాతీస్తే షరా మామూలే. తనకు ఎంపి టిక్కెట్టుతో పాటు తాను చెప్పిన వారికి ఎంఎల్ఏ టిక్కెట్ల డిమాండ్. దాంతో చంద్రబాబు కూడా సునీల్ ను దూరంపెట్టేశారని సమాచారం.

 

ఈనెల మొదట్లో  సునీల్ జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఎలాగూ వారిద్దరికీ పూర్వ పరిచయం ఉంది కాబట్టి జనసేనలో సర్దుకుంటారని అనుకున్నారు. పవన్ ను కలిసి పదిరోజులైనా ఇంత వరకూ జనసేనలో చేరలేదు. విషయం ఏమిటని ఆరాతీస్తే ఇక్కడా సునీల్ పాత కథే వినిపించారట. తనతో పాటు తాను సూచించిన వారికి అసెంబ్లీ టిక్కెట్లని. మరి పవన్ ఏం నిర్ణయం తీసుకున్నారో ఇంకా తెలీదు. ఆర్ధికంగా సునీల్ బాగా గట్టి స్ధితిలో ఉన్నాడని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. కాబట్టి తానేం చెప్పినా పార్టీలు వింటాయనే నమ్మకం సునీల్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. డబ్బుతోనే రాజకీయాలు చేయొచ్చనే ఆలోచనలో సునీల్ ఉంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటుండదు.


మరింత సమాచారం తెలుసుకోండి: