ఎంతటి నాయకుడికైనా కొన్ని మైనసులు ఉంటాయి. వాటిని హైలెట్ చెయడమే విపక్షాల పని. ఆ విషయంలో లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా టాలెంట్ చూపిస్తున్నడు పవర్ స్టార్. మాటకొస్తే ఆ విషయమే పట్టుకుంటున్నాడు. ఆ టాపిక్ తోనే రచ్చ చేస్తున్నాడు. దాంతో బాబుకు తెగ ఇరకాటంగా ఉంది. 


వారసత్వం మచ్చ :


చంద్రబాబు మీద తొలి దఫా ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎటువంటి ఆరోపణలూ లేవు. ఆయన మీద వేలెత్తి చూపించలేని విధంగా వ్యవహరించారు. 2014లో సీఎం అయ్యాక మాత్రం ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. బంధుప్రీతి. కులం పట్ల మమకారం కూడా బాగా పెరిగాయని విమర్శలు వచ్చాయి. దానికి తగినట్లుగా ఈ దఫాలో ఎన్నో ఆరోపణలు, అవినీతి కధలు కూడా వెలుగు చూశాయి. అన్నిట్లోనూ ఒకే సామాజిక వర్గం ఆధిపత్యం కూడా కనిపించింది. ఈ పరిణామాల నేపధ్యంలో మరోటి కూడా తోడైంది.


అది ప్లస్ కాలేదుగా:


కేసీయార్ తన కొడుకుని మంత్రిని చేశాడు కాబట్టి ఇక్కడ తాను చేసెతే తప్పేంటి అనుకున్నారో ఏమో కానీ చంద్రబాబు మూడవ ఏడు పాలన పూర్తి కాగానే లోకేష్ ని తెచ్చి మంత్రిని చేశారు. దాంతో బాబుపై అంత వరకు ఉన్న భావనలు పటాపంచలు అయ్యాయి. ఆయన కూడా ఆ తానులో ముక్కేనన్న ఘాటు విమర్శలు చోటు చేసుకున్నాయి. అక్కడ నుంచే బాబు గుక్క తిప్పుకోలేకుండా ఉన్నారు.


పక్కకు జరిగిన తర్వాత :


ఇక పవన్ ఆ మధ్య కాలమంతా టీడీపీ వైపే ఉన్నారు. ఆయన టీడీపీకి మద్దతు ఇస్తున్నపుడే లోకేష్ మంత్రి అయ్యారు. అయితే అపుడు  ఏమీ అనని పవన్ కాస్త పక్కకు జరిగాక అదే లోకేష్ పై బాణాలు సంధించారు. బాబు జాబు తన కొడుక్కి మాత్రమే ఇచ్చారని హాట్  కామెంట్స్ చేసారు. ఇవన్నీ జనంలోకి బాగా వెళ్ళిపోయాయి. అవినీతి, బంధుప్రీతి వంటివెన్ని ఉన్నా కళ్ళకు కనిపించే విషయం మాత్రం లోకేష్ మంత్రి కావడమే.
దాంతో బాబు మీద నమ్మకం తగ్గడానికి, ఇమేజ్ డ్యామేజ్ కావడానికి లోకేష్ మంత్రి పదవి చాలానే చేసింది. అయినా బాబు ఏమీ చేయలేని స్థితి. రాజకీయంగా అయనకు ఇది నష్టమని తెలిసినా భరిస్తున్నారు. పవన్ సైతం అదే ప్రధానంగా చేసుకుని గురి పెడుతున్నారు. చెప్పాలంటే జగన్ కంటే కూడా పవనే ఈ విషయంలో బాబు, లోకేష్ లను కలిపి తిడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: