మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనే అన్నాట్ట వెనకటికి ఒకడు. ఏపీలో ఇపుడు అదే జరుగుతోంది. పంచాయతీ వార్డు మెంబర్ కూడా ఉనికి లేని ఆ పార్టీ ఇపుడు ఏకంగా పెద్ద కోరికలే కోరుతోంది. ఇచ్చేవారుంటే పుచ్చుకుందామని చూస్తోంది. మడత పేచీలకూ దిగుతోంది. 


పొత్తుల షరతులు :


తెలంగాణాలో కాంగ్రెస్ బలమైన పార్టీ. అందులో సందేహం లేదు. ఇపుడు ఆ పార్టీకి మిత్ర పక్షాల నుంచి గట్టి డిమాండ్లు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏకంగా ముప్పయి సీట్ల వరకూ కోరుతోంది. . కాంగ్రెస్ మాత్రం డజనుకు మించి ఇవ్వమని ఖరాఖండీగా చెబుతోంది. ఈ నేపధ్యంలో  ఏపీ కాంగ్రెస్ నేతలు ఇక్కడ ఎంటరయ్యారని టాక్. 


ఇక్కడా ఇవ్వాల్సిందే:


కేవలం పొత్తులు తెలంగాణాకు పరిమితం చేస్తే ఊరుకునేది లేదు. ఏపీకి కూడా విస్తరించాల్సిందే. అంతే కాదు. ఏపీలో  కనీసంగా ముప్పయి నుంచి నలభై వరకు అసెంబ్లీ సీట్లు, అయిదు ఎంపీ సీట్లు ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్ నేతలు మడత పేచీ పెడుతున్నారట. టీడీపీని అట్నుంచి నరుక్కురావాలని వారు డిసైడ్ అయ్యారట. తెలంగాణా పొత్తుల సందర్భంగానే బాబుని కాస్త గట్టిగా పట్టుపడితే ఏపీ ఎన్నికల్లో ఆయన దారికి వస్తారని దూరాలోచన చేస్తున్నారుట.


కుదరదంటున్న టీడీపీ:


తెలంగాణా పొత్తులు ప్రస్తుతానికి అక్కడే పరిమితమని, ఏపీలో రేపటి ఎన్నికల్లో చూసుకోవచ్చునన్నది టీడీపీ పెద్దల వాదనగా ఉంది. పైగా టీ టీడీపీ నేతలు కూడా ఈ సరికొత్త పితలాటకమేంటని గుస్సా అవుతున్నారుట. ఏపీ వ్యవహారం ఇక్కడ కాదు, అది విజయవాడలో తేల్చుకోండి, మాకు మాత్రం ముప్పయి సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నారట. 


అయితే ఈ విషయం ఇక్కడితే వదిలేయరాదని వీలుంటే రాహుల్ గాంధీ దాకా తీసుకుపోయి ఏపీ పొత్తుల విషయాన్ని ఖరార్ చేసుకోవాలని ఏపీ కాంగ్రెస్ నేతలు ఉన్నారట. అదే జరిగితే టీడీపీకి కొత్త చిక్కులు తప్పవేమో. మొత్తానికి విభజన దెబ్బకు కుదేలైపోయిన తరువాత హస్తం పార్టీ నేతలకు కొత్త ఆలొచనలు చాలానే పుట్టుకువస్తున్నాయి. పైగా అతి తెలివి కూడా పెరిగిందని టీడీపీ తమ్ముళ్ళు గొణుక్కుటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: