తెలంగాణా టీడీపీలోకి కొత్త ర‌క్తం ప్ర‌వేశిస్తోంది. వ‌చ్చే డిసెంబ‌రు 7న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు చాలా వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నారు. ఇక్క‌డ అధికార పార్టీకి దిమ్మ‌తిరిగేలా దెబ్బ‌కొట్టాల‌ని నిర్ణ‌యించుకున్న చంద్ర‌బాబు ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ స‌హా ఇత‌ర ప‌క్షాల‌ను ఓ గొడుగు కింద‌కు చేర్చి మ‌హాకూట‌మి పేరుతో ముందుకు సాగుతున్నారు. ఇక‌, పార్టీలోకి కొత్త వారిని కూడా ఎంట‌ర్ చేస్తున్నారు. ముఖ్యంగా తాజాగా సినీ రంగంలోని వారికి చంద్ర‌బాబు రెడ్ కార్పెట్ ప‌రిచారు. వాస్త‌వానికి నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవ‌రైనా ముందుకు వ‌స్తే వారికి ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావించారు. అయితే, నంద‌మూరి ఫ్యామిలీ నుంచి ఆయ‌న ఆశించిన జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌హా ఎవ‌రూ ముందుకు రాలేదు. 


అయితే, తాజాగా ఇండ‌స్ట్రీ నుంచి సినీ నటి రేవతి చౌదరి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సమక్షంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పసుపు కండువా కప్పి రేవతిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులతో ఎన్టీఆర్ భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమై చర్చించారు. ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలోనే రేవతి టీడీపీలో చేరారు. విజయవాడకు చెందిన రేవతి చౌదరి నాగార్జున యూనివర్సిటీలో చదివారు. 1998లో మిస్ విజయవాడగా ఎంపికయ్యారు. తరువాత సినీ రంగంపై మక్కువతో హైదరాబాద్‌కు మకాం మార్చారు. 


శివాజీ హీరోగా నటించిన సినిమాతో రేవతి తెరంగేట్రం చేశారు. అయితే పలు కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. నందమూరి తారకరత్న హీరోగా చేస్తున్న ‘కాకతీయుడు’ అనే సినిమాలో కూడా రేవతి నటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అవకాశం ఇస్తే ఈ ఎన్నికల్లో హైదరాబాద్‌లోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి రేవతి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితి సీనియ‌ర్లు మాత్ర‌మే అవ‌కాశం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో, అదీకాక‌.. కొద్ది పాటి సీట్ల‌కే పోటీ చేస్తుండ‌డంతో ఈమెకు అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ త‌క్కువ‌గానే ఉంది. అయితే, ప్ర‌చారానికి వినియోగించుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: