చంద్రబాబునాయుడుకు కాపు నేతలు షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అదికూడా తెలుగుదేశంపార్టీలోనే ఉన్న కాపు నేతల నుండే షాక్ తగులుతుందనే అనుమానం వస్తోంది. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో తమకు ఎన్ని సీట్లు కేటాయించాలని అనుకుంటున్నారో చెప్పాలని కాపు నేతలు త్వరలో చంద్రబాబును కలవనున్నారు. నిజానికి సోమవారమే చంద్రబాబును కలుద్దామని కాపునాడు నేతలు విజయవాడకు చేరుకున్నారు. అయితే, హైదరాబాద్ లో జరిగిన పాలిట్ బ్యూరో సమావేంలో పాల్గొన్న తర్వాత  పోలవరం వెళ్ళారు. దాంతో చంద్రబాబును కలవటం సాధ్యం కాదని కాపునాడు నేతలు తిరిగి వెళ్ళిపోయారు.

 

విషయం ఏమిటంటే, చంద్రబాబును కలిసి డిమాండ్లు పెట్టాలని అనుకున్న వారిలో ఎక్కువ మంది తెలుగుదేశంపార్టీలోని కాపు నేతలే ఉన్నారు. చంద్రబాబును కలవాలనుకోవటంలో ముఖ్య ఉద్దేశ్యమేమిటంటే వచ్చే ఎన్నికల్లో కాపులకు అసెంబ్లీ టిక్కెట్లలో ఎన్ని ఇవ్వాలని అనుకుంటున్నారో కనుక్కోవటమే. అయితే, తాము ఆశించినట్లుగా చంద్రబాబు సమాధానం చెప్పరని వాళ్ళకు కూడా తెలుసు.

 

అందుకనే కాపు జనాభా దామాషా ప్రకారం సుమారు 40 అసెంబ్లీ టిక్కెట్లు  రావాలని లెక్కలేసుకున్నారు. ప్రతీ జిల్లాలోను ముడు అసెంబ్లీ టిక్కెట్లు రావాలని కాపు నేతలు ఓ సమావేశంలో తీర్మానించారట. అదేవిధంగా జిల్లాకో ఎంఎల్సీ టిక్కెట్టుతో పాటు మొత్తం మీద తొమ్మిది లోక్ సభ టిక్కెట్లు కాపులకు రావాలట. మరి అన్ని టిక్కెట్లు చంద్రబాబు ఇస్తారా అన్నది సందేహమే. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో కాపులను బిసిల్లో చేరుస్తానన్న హామీనే తుంగలో తొక్కిన ఘనుడు చంద్రబాబు.

 

కాపు నేతల సమాచారం ప్రకారం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకుంటే ఇప్పటి వరకు ఒక్క కాపు నేతను కూడా ఏ కార్పొరేషన్  ఛైర్మన్ గా నియమించలేదు. తమను బిసిల్లో చేరుస్తానన్న హామీని తుంగలో తొక్కటమే కాకుండా తన  చేతిలో ఉన్న కార్పొరేషన్లకు కూడా కాపులను ఛైర్మన్ గా నియమించక పోవటంపై బాగా మంటగా ఉన్నారు. ఎలాగూ మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇఫ్పటికిప్పుడు తమకేదో చేస్తారనే నమ్మకం కూడా కాపుల్లో లేదు. అందుకనే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

చంద్రబాబుపై ఒత్తిడి పెంచటంలో భాగంగానే వచ్చే నెలలో తిరుపతిలో భారీగా కాపు సభను నిర్వహించేందుకు ప్లాన్ కూడా చేసుకుంటున్నారు. ఒకపుడంటే చంద్రబాబును బతిమలాడుకోవటం తప్ప కాపులకు వేరే దారిలేదు. కానీ వచ్చే ఎన్నికలకు అలాకాదు. తెలుగుదేశంపార్టీ కాదంటే వైసిపి, జనసేన, బిజెపి, కాంగ్రెస్ లాంటి పార్టీలున్నాయి. ఎటూ జనసేన కాపులకోసం పెట్టిన పార్టీగా ప్రచారంలో ఉంది. పైగా అభ్యర్ధులు కూడా పెద్దగా లేరు. టిక్కెట్ల విషయానికి వస్తే బిజెపిది కూడా సేమ్ టు సేమ్. కాబట్టి వచ్చే నెలలలోనే చంద్రబాబు ఆలోచనలేంటో తెలుసుకుని తమదారేదో తాము చూసుకోవటం ఉత్తమమని టిడిపిలోని కాపు నేతలు నిర్ణయించుకున్నారు. మరి చంద్రబాబును కలిసిన తర్వాత ఏమవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: