జనసేనాని నెమ్మదిగా మాటలు నేర్చుకుంటున్నారు. సినిమా డైలాగులు మానేసి రాజకీయ బాణాలను బాగానే ఎక్కుపెడుతున్నారు. పక్కన అనుభవం ఉన్న వారు చేరిన పుణ్యమో లేక రాజకీయంలో నలుగుతున్న వైనమో తెలియదు కానీ పవన్ బాగానే రాటుదేలుతున్నారు. ఆయన ఓ పద్దతి ప్రకారం చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పుకోవడం టీడీపీ వల్ల కావడం లేదు.


సరైన పాయింటుతో అటాక్ :


చంద్రబాబుది ప్రచార యావ తప్ప నిజంగా బాధితులకు చేసిందేమీ లేదంటూ పవన్ డైరెక్ట్ అటాక్ చేశారు. తిత్లీ తుపాను భయంకరంగా కదలి వస్తోందని తెలిసినా బాబు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారంటూ పవన్ చేసిన విమర్శ టీడీపీకి బాగానే తగిలేదే. అంతే కాదు. తుపాను సహయం మొదలైన రెండవ రోజే మొత్తం పరిస్థితి అదుపులోకి వచ్చిందంటూ బాబు చేసిన ప్రకటన వల్లనే కేంద్రం నెమ్మదించిందని పవన్ చెప్పిన మాటలో లాజిక్ ఉంది.


సహాయం ఏదీ :


నాలుగు రోజుల పాటు తిత్లీ తుపాను ప్రాంతాలలో విస్త్రుతంగా పర్యటించి వచ్చిన పవన్ తన అనుభవాలను మీడియాతో పంచుకుంటూ ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పి మరీ టీడీపీని సాధికారికంగా ఉతికేశారు కేవలం రోడ్డు పక్కన ఉన్న గ్రామాలకే సహాయం అందుతోందని మారు మూల గ్రామాలను టీడీపీ సర్కార్ పట్టించుకోవడం లేదని పవన్ చేసిన విమర్శలకు సమాధానం టీడీపీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


వివక్షపైనా దాడి :


ఇక తిత్లీ తుపాను సహాయంలోనూ రాజకీయం చోటు చేసుకుంటోందని పవన్ కొత్త కోణాన్ని బయటకు తీశారు. తిత్లీ తుపాను వల్ల గ్రామాలకు గ్రామాలూ కొట్టుకుపోతే కేవలం టీడీపీ సానుభూతిపరులకే సహాయం అందించడమేంటని పవన్ సూటిగానే ప్రశ్నించారు. వైసీపీ, జనసేన, కాంగ్రెస్ వంటి పార్టీలకు చెందిన వారికి ప్రభుత్వ సహాయం అందించరా అంటూ పవన్ అడుగుతున్న ప్రశ్నలకు బాబు ఏం జవాబు చెబుతారో.
మొత్తానికి తిత్లీ తుపానుపై ఇంతవరకూ అధికార పార్టీ వెర్ష‌న్ మాత్రమే మీడియాలో ఫోకస్ అవుతోంది. ప్రతిపక్ష నాయకునిగా పవన్ జనంలోకి వెళ్ళి వేరే కోణంలో సమాచారం తీసుకురావడం అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేదే. పైగా బాగా సాయం చేశామన్న మాటల వెనక డొల్లతనాన్ని పవన్ గట్టిగానే ఎండగట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: