తెలంగాణలో ఇప్పటికే భూస్థాపింతం అయిన తెలుగుదేశం పార్టీని తిరిగి ట్రాక్‌లోకి ఎక్కించేందుకు, ఆ పార్టీకి జవసత్వాలు నింపేందుకు, ఆ పార్టీని అక్కడ తిరిగి బతికించుకునేందుకు  టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించేలా కనపడడం లేదు. తెలంగాణలో నిన్నమొన్నటి వరకు మహాకూటమిలో తనదే పెద్దన్న పాత్ర అని చెప్పి గొప్పకు పోయిన చంద్రబాబు సీన్‌ ఇప్పుడు పూర్తిగా రివర్స్‌ అయ్యినట్టే కనిపిస్తోంది. నిన్నటి వరకు తెలంగాణలో 35 సీట్లలో పోటీ చేస్తాం, 30 సీట్లలో పోటీ చేస్తాం, 25 కాదు కాదు 20కు తగ్గకుండా సీట్లలో పోటీ చేస్తామని గొప్పలు పోయిన టీడీపీ నాయకులు ఇప్పుడు చంద్రబాబు జారీ చేస్తున్న ఆదేశాలతో షాక్‌ అవుతున్నట్టు తెలుస్తోంది. 


వచ్చే ఎన్నికల్లో ఎలాగైన కేసీఆర్‌ను గద్దె దింపాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ప్రవచనాలు భోదించడం టిటీడీపీ నేతలకు మింగుడు పడడంలేదు. కేసీఆర్‌ను గద్ది దింపేందుకు అవసరం అయితే త్యాగాలు సైతం చేయాలని టీడీపీ నేతలకు ఆయన హితభోద చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే గత నాలుగేళ్లలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన 14 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయినా ఇంకా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న సీనియర్‌ నాయకులకు ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న  మాటలు ఏ మాత్రం రుచించడం లేదు. నిండా మునిగిన వాడికి చలి ఏంటి అన్న‌ సామెత లెక్కగా తెలంగాణలో ఇప్పటికే టీడీపీ పూర్తిగా మునిగిపోయింది. అయితే ఇంకా ఆ పార్టీనే నమ్ముకుని ఆ పార్టీతోనే భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్న నేతలు ఈ ఎన్నికల్లో అయినా పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందాలని ఆశ పడ్డారు. 


ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 15సీట్లలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఈ 15తో పాటు మరో 5 సీట్లు కలుపుకుని మొత్తం 20 సీట్లలో పోటీ చెయ్యాలని టిటీడీపీ నేతలు భావించారు. ఇప్పటికి తెలంగాణలో చాలా మంది పార్టీ మారిపోయినా సీనియర్లుగా ఉన్నవాళ్లు, కొద్దోగొప్పో పేరున్న నేతలు 20 మందికి పైగానే ఉన్నారు. ఈ 20 మందికి అయినా ఈ ఎన్నికల్లో సీట్లు వస్తాయని వారు ఆశించారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న నేపథ్యంలో తాము సులువుగానే గెలుస్తామని వారు లెక్కలు వేసుకున్నారు. ఈ సీట్లు కాస్త 20 నుంచి 19 ఆ తర్వాత 15... ఇప్పుడు కాంగ్రెస్‌ 12 మాత్రమే ఇస్తానంటుండ‌డంతో స‌ర్దుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చాక నామినేటడ్‌ పదవులు తీసుకోవాలని టీకాంగ్రెస్‌ చెప్పడంతో చివరకు చంద్రబాబు సైతం మహాకూటమిలో తన మాట చెల్లుబాటుకాక టిక్కెట్లు ఆశిస్తున్న వాళ్లకు ఇదే మాట చెప్పారట. దీంతో టిటీడీపీ నేతల ముఖాలు మాడిపోయినట్టు తెలుస్తోంది. 


టీ టీడీపీయే 12 సీట్లు అడుగుతుండడంతో అంతకన్నా తక్కువ బలం ఉన్న సీపీఐ, తెలంగాణ మహజనసమితి సైతం ఎన్ని సీట్లు డిమాండ్‌ చేసినా ఆ రెండు పార్టీలకు ఇంకా చాలా తక్కువ సీట్లు మాత్రమే ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. సీపీఐ 19 సీట్లు అడుగుతుంటే కాంగ్రెస్‌ మూడు మాత్రమే ఇస్తానంటుంది. ఇక తెలంగాణ మహజనసమితి అధినేత కోదండరాం ఏకంగా 36 సీట్లు అడిగితే కాంగ్రెస్‌ 10 నుంచి 12 మాత్రమే ఇస్తానంటుందట. ఏదేమైన మహాకూటమిలో చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబు చివరకు ఇలా కాంగ్రెస్‌కు 12 సీట్ల‌కు పడిపోవడం టిటీడీపీ నేతలకు ఏ మాత్రం నచ్చడం లేదు. దీనికి తోడు పార్టీలో చాలా మంది కీలక నేతలకు సైతం టిక్కెట్లు రాని పరిస్థితి ఏర్ప‌డింది.



మరింత సమాచారం తెలుసుకోండి: