అధికార తెలుగుదేశంపార్టీ నేతల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా అందుకే వివాదాలు ఎక్కువైపోతున్నాయ్. ఇంతకీ ఈ గొడవలెందుకు ? ఎందుకంటే, అక్రమ సంపాదన కోసమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా ఓ మంత్రికి ఎంఎల్ఏకి మధ్య గొడవలు ముదిరిపోయి చివరకు విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదులు చేసుకునే దాకా వెళ్ళిందంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, కర్నూలు జిల్లాలో మంత్రి అఖిలప్రియ, ఎంఎల్ఏ బుడ్డా రాజశేఖరరెడ్డి వర్గాల మధ్య గొడవలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఎర్రమట్టి అక్రమ తవ్వకాల కోసం ఇద్దరి వర్గాల మధ్య ఇపుడు గొడవలవుతున్నాయి. ఇద్దరు అనుచరులు పోటాపోటీగా ఎర్రమట్టి తవ్వేసుకుంటున్నారు. నంద్యాల పట్టణానికి సమీపంలోనే ఉన్న మహానంది మండలంలో ఎర్రమట్టి కావాల్సినంత దొరుకుతుంది. నీరు, చెట్టు పథకం అయిపోయింది కదా అందుకనే తాజాగా ఎర్రమట్టిపై టిడిపి నేతలు కన్నేశారు.


తన నియోజకవర్గంలో తాను మాత్రమే మట్టిని తవ్వుకోవాలంటూ బుడ్డా వాదిస్తున్నారు. కాదు పొలం సొంతదారుని వద్ద తాము లీజుకు తీసుకున్న కారణంగా ఎర్రమట్టి తవ్వుకునే అధికారం తమకూ ఉందంటూ మంత్రి మద్దతుదారులు వాదిస్తున్నారు. సరే వారి వాదనలు, ప్రతి వాదనలు ఎలాగున్నా ఎర్రమట్టిని మాత్రం అక్రమంగా తవ్వేసుకుంటూ కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నది మాత్రం వాస్తవం. మహానంది మండలంలో ఎక్కడ ఎర్రమట్టి కనిపించినా వెంటనే అక్కడ అఖిల, బుడ్డా స్టిక్కర్లతో మద్దతుదారులు వాలిపోతున్నారు.


మట్టి కోసం ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోయి మంత్రి అనుచరులపై బుడ్డా ఏకంగా విజిలెన్స్ విభాగానికే ఫిర్యాదు చేశారట. దాంతో బుడ్డా ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ సిబ్బంది దాడులు చేసి మంత్రి అనుచరుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో మంత్రి వైపు నుండి అధికారులపై ఒత్తిళ్ళు మొదలయ్యాయట. అదే సమయంలో ఇటుకుల తయారీకి తమ దగ్గరే మట్టిని తీసుకోవాలని ఇటుకుల బట్టీ యజమానులపై ఒత్తిళ్ళు మొదలయ్యాయట.


దాంతో రెండు వైపుల నుండి ఎప్పుడే గొడవ వచ్చి మీదపడుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. కొసమెరుపేమిటో తెలుసా ? ఒకపుడు బుడ్డా మంత్రి అఖిలప్రియను కోడలా అని పిలిస్తే మంత్రి కూడా ఎంఎల్ఏని మామా అంటూ పిలిచేది. కానీ ఎక్కడైనా బావ కానీ వంగతోట దగ్గర కాదన్నట్లు చివరకు ఆర్దిక వివాదాలే ఇద్దరినీ వేరు చేశాయని జనాలు చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: