ముంద‌స్తు ఎన్నిక‌ల ముచ్చ‌ట‌కు తెర‌లేచిన తెలంగాణాలో..  అధికార టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా ముం దుకు వెళ్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలుపు గుర్రం ఎక్కాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి కార్య‌క ర్త‌ను ఆయ‌న క‌దిలిస్తున్నారు. మంత్రులు, తాజామాజీ ఎమ్మెల్యేలు, పార్టీ అభ్యర్థులతో ఎప్ప‌టిక‌ప్పుడు కేసీఆర్ భేటీ అయి దిశానిర్దేశనం చేస్తున్నారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, పోలింగ్‌ రోజు వరకు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలపై   వివరిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను వినియోగించుకుంటున్న వారు ప్రతి నియోజకవర్గంలోనూ సుమారు 60 వేల మంది వరకు ఉన్నట్లు గుర్తించి.. నియోజకవర్గాల వారీగా వారి వివరాలను అభ్యర్థులకు ఇస్తున్నారు. 


కరీంనగర్‌ జిల్లాలో అన్ని సీట్లల్లో అభ్యర్థుల ప్రచార తీరు బాగుందని, జగిత్యాలలో కొంత పుంజుకోవాల్సిన అవసరం ఉం దని గుర్తించారు. ఉత్తర తెలంగాణలో 54 సీట్లల్లో అధిక్యత దిశగా కొనసాగుతున్నా.. మెజార్టీ ఎంత అన్న విషయంపై దృష్టి సారించాల్సిన అవ‌స‌రాన్ని కేసీఆర్ గుర్తించారు.  పార్టీ పాక్షిక మేనిఫెస్టోపై ప్రజల్లో విసృతంగా ప్రచారం నిర్వహించ‌డం పైనా ఆయ‌న దృష్టి పెట్టారు.  ప్రతిపక్షాలు చేస్తున్న గోబెల్స్‌ ప్రచారాన్ని తిప్పికొట్ట‌డంపైనా కేసీఆర్ వ్యూహాత్మ‌కంగానే ముందుకు వెళ్తున్నారు. శాసనసభ రద్దు చేసిన నాటి నుంచి నేటి వరకు చేసిన సర్వేలలో టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా ఉందని, అందరికీ 60 శాతంపైగానే ప్రజలు మద్దతు పలుకుతున్నారని అంటున్న‌కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల అభిప్రాయాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటూనే మ‌రింత‌గా ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచిస్తున్నారు. 


అభ్యర్థులు మరింత కష్టపడి ప్రజల మద్దతు కూడగట్టుకుంటే విజయం నల్లేరుమీదనడకే అని ప్ర‌చారం చేస్తున్నారు. 50 రోజుల్లో తెలంగాణలో 100 సభలు నిర్వహించాలని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. నవంబర్‌ మొదటి వారంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు ద్వారా తెలంగాణ‌లో కీల‌కైన జిల్లాలో జ‌య‌భేరి మోగించాల‌ని కేసీఆర్ సంక‌ల్పించ‌డం గ‌మ‌నార్హం. అభ్యర్థులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు బహిరంగసభను విజయవంతం చేసే దిశగా వ్యూహం సిద్ధం చేసుకున్నారు. నవంబర్‌ 12న ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోగా ఉత్తర తెలంగాణలో 30 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పూర్తి చేసేందుకు కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకున్నారు. అయితే, ఇప్పుడు మ‌హాకూటమి దెబ్బ‌కు కేసీఆర్ వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: