తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు ఏర్పడిన మహాకూటమి ఓ కొలిక్కి వచ్చింది. కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, సీపీఐ, తెలంగాణ మహాజనసమితి పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు కూటమిలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చెయ్యాలి, ఏ సీటు నుంచి ఏ పార్టీ పోటీ చెయ్యాలి, ఎక్కడ ఏ అభ్యర్థి పోటీ చెయ్యాలి అనేదానిపై స్పష్టత లేకపోవడంతో కూటమి ఉంటుందా ? లేదా అన్న గందరగోళ పరిస్థితులు కూడా తలెత్తాయి. అయితే కూటమిపై ఎట్టకేలకు ఓ కొలిక్కి రావడంతో కూటమి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌ 90, సీపీఐ 4, టీడీపీ 15, తెలంగాణ మహాజనసమితి 10 సీట్లలో పోటీ చేసేందుకు సూత్రాభిప్రాయంగా ఓ అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. కూటమి ఏర్పాటు ఎలా ఉన్నా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో 15 సీట్లలో గెలిచింది. ఈ సీట్లలో మెజారిటీ సీట్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిదిలోనే ఉన్నాయి. 


ఇప్పుడు కూటమి ఏర్పడడంతో ఆ సీట్లలో కూటమి అభ్యర్థులకు గెలుపు ఛాన్సులు ఎక్కువ ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సీట్ల నుంచే పోటీ చేసేందుకు అటు టీడీపీలో ఆశావాహులు లిస్టు చాంతాడంత ఉంటే ఇటు కాంగ్రెస్‌లో కొందరు కీలక నేతలు సైతం అదే సీట్లపై కన్నేశారు. జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, ఉప్పల్, ఎల్‌బీ.నగర్‌, మహేశ్వరం, రాజేంద్రనగర్‌ లాంటి సీట్లలో అటు కాంగ్రెస్‌ ఇటు టీడీపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతుండడంతో టీడీపీ, కాంగ్రెస్ మధ్య‌ సీట్ల పంపిణీ ప్రధాన సమస్యగా ఉంది. అలాగే కొత్తగూడెం లాంటి చోట్ల టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్‌ మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. దీంతో ఇలాంటి కీలక సీట్లను సద్దుబాటు చేసుకోవడమే ఇప్పుడు కూటమి ముందున్న ప్రధాన సవాల్‌. 


కూటమిలో ఆయా పార్టీలకు నేతృత్వం వహిస్తున్న లీడర్లలో టిటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ ఎక్కడ పోటీ చేస్తారన్నది నిన్నటి వరకు క్లారిటీ లేదు. ఆయన సొంత నియోజకవర్గం అయిన జగిత్యాలలో టీకాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ జీవన్‌ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను అక్కడ తప్పించే ఛాన్సులు లేవు. దీంతో నిన్నటి వరకు రమణ గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అనుకున్నా తాజాగా ఆయన కోరుట్ల బరిలో దిగడం ఖాయం అయ్యింది.ఇక టిటీడీపీలో మరో సీనియర్‌ లీడర్‌, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిని హుస్నాబాద్‌ నుంచి పోటీ చెయ్యాలని కాంగ్రెస్‌ వర్గాలు భావించాయి. అయితే ఆయన అక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆయన పేరు కూకట్‌పల్లి బరిలో వినపడుతోంది. కూక‌ట్‌ప‌ల్లి సీటు పెద్దిరెడ్డికి ఖ‌రారే అంటున్నారు. 


ఇదిలా ఉంటే సీపీఐకి చెందిన సీనియర్‌ లీడర్‌ చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్‌ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. అయితే అక్కడ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌ రెడ్డి ఉండడంతో ఈ సీటు ఎవరికి కేటాయిస్తారు అన్నది మాత్రం కాస్త సస్‌పెన్స్‌గానే ఉంది. అలాగే తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం మంచిర్యాల నుంచి పోటీ చెయ్యడం షురూ అయ్యిందంటున్నారు. అలాగే టీకాంగ్రెస్ చీఫ్‌ ఉత్తమ కుమార్‌ రెడ్డి భార్య పద్మావతి ప్రాధినిత్యం వహిస్తున్న కోదాడ సీటును సైతం టీడీపీ అడుగుతుంది. ఈ సీటును ఎవరికి ఇస్తారన్నది కూడా చూడాల్సి ఉంది. కొత్తగూడెం సీటు కోసం సీపీఐ నుంచి మాజీ ఎమ్మెల్యే కూనంమనేని సాంబశివరావు, టీడీపీ నుంచి మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు చిన్ని, కాంగ్రెస్‌ నుంచి వన‌మా వెంకటేశ్వరరావు, యడ్లపల్లి కృష్ణ ఇద్దరూ పోటీ పడుతున్నారు. మరి ఈ సీట్లలో ఏ పార్టీ పోటీ చేస్తుంది మిగిలిన వారిని ఎలా సంతృప్తి పరుస్తారు ? అన్నదాని బట్టి కూడా ఇక్కడ మహాకూటమి అభ్యర్థుల విజయవకాశాలు ఆధారపడి ఉంటాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: