పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఏం చేస్తాడన్న సంగతీ ఎవరికీ తెలియదు. బడుగు, బలహీన వర్గాల పేరు చెబితేనే పవన్ మెడలోని ఎర్రతుండు అంతెత్తున పైకి లేస్తుంది. అందుకే పొలోమంటూ ఓ టీమ్ ని వేసుకుని ఉత్తర ప్రదేశ్ కి వెళ్లారు జనసేనాని. అక్కడ అంబేద్కర్ మెమోరియల్ పార్క్ సందర్శనతో తనో కొత్త ప్రపంచాన్ని చూసినట్టు అనుభూతి చెందారు. తెలంగాణ ఎన్నికలని దృష్టిలో ఉంచుకుని పవన్ బీఎస్పీతో భేటీకి వెళ్లాడనేది అందరికీ తెలిసిన విషయమే.


2014 ఎన్నికల్లో బీఎస్పీ తెలంగాణలో 2 సీట్లు గెల్చుకున్నమాట వాస్తవమే. గెలిచిన ఇద్దరూ తర్వాత 'కారు' ఎక్కేశారు. ఆ సంగతి పక్కనపెడితే ప్రస్తుతం పోటీ పోటీ అంతా టీఆర్ఎస్, మహాకూటమి మధ్యే నడుస్తోంది. బీజేపీ కూడా ఎలా నెగ్గుకు రావాలా అని తలమునకలవుతోంది.ఇలాంటి టైమ్ లో 'మేధావుల' మాటలు నమ్మి బీఎస్పీతో చర్చలకు వెళ్లారు పవన్. ఉత్తరాదిలో తప్ప తెలుగు రాష్ట్రాల్లో బీఎస్పీకి పెద్ద ప్రాధాన్యం లేదనే విషయం జనసేనానికి తెలియదా?


నిజంగానే మాయావతి పార్టీకి అంత సీన్ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపేది కదా? బడుగు బలహీన వర్గాలంతా తమ నేతలకే మద్దతిస్తే బీఎస్పీనే అధికారంలోకి రావాలి కదా? కానీ ఇక్కడ పరిస్థితులు భిన్నం. మన రాజకీయాలను స్థానిక పరిస్థితులు, కులం, మద్యం, డబ్బు ప్రభావితం చేస్తాయనేది వాస్తవం. ఇలాంటి టైమ్ లో పవన్ బీఎస్పీ భేటీకి ఎందుకంత అర్రులు చాస్తున్నారో ఆయనకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: