పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న నవయుగ ఇంజనీరింగ్ కంపెనీపై ఈరోజు ఐటి దాడులు జరిగాయి. నవయుగ ఇంజనీరింగ్ కు చెందిన మొత్తం 47 సంస్ధలపై ఏకాకలంలో దాడులు జరగటం ఆశ్చర్యంగా ఉంది. బెంగుళూరు, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఐటి అధికారుల సోదాలు జరుగుతున్నాయి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నిబంధనలను కంపెనీల యాజమాన్యం ఉల్లంఘించినట్లు చాలా ఆరోపణలు వినబడుతున్నాయి. అందుకే ఒక్కసారిగా అంతమంది ఉన్నతాధికారులు దాడులు చేశారు.

 

నిజానికి పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్నది ట్రాన్ స్ట్రాయ్ సంస్ధ అన్న విషయం అందరికీ తెలిసిందే.  పనులు సక్రమంగా చేయలేక చేతులెత్తేస్తే అవే పనులను పాత ధరలకు తాను చేస్తానంటూ నవయుగ కంపెనీ ముందుకు వచ్చింది. దాంతో చంద్రబాబు నామినేషన్ పై నవయుగ కంపెనీకి పోలవరం ప్రాజెక్టు పనులను అప్పగించటం అప్పట్లో సంచలనమైంది. పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు తన మద్దతుదారులకు ఇష్టం వచ్చిన రీతిలో నామినేషన్ పై పనులను ఇచ్చేయటంపై పెద్ద రచ్చే జరుగుతోంది. అయినా చంద్రబాబు ఎవరినీ లెక్క చేయటం లేదు.

 

అదే సమయంలో నవయుగ కంపెనీ చేస్తున్న పనులపైన కూడా బాగా ఆరోపణలు వినబడుతున్నాయి. దానిలో భాగంగానే జూబ్లిహిల్స్ లోని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ కార్యాలయంలో ఉదయం సోదాలు నిర్వహించి 6 హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. గడచిన నాలుగున్నరేళ్ళుగా నవయుగ కంపెనీ చేపడుతున్న కాంట్రాక్టు పనులు, సంస్ధలు దాఖలు చేసిన ఐటి రిటర్నులు, రికార్డులు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తం మీద నవయుగ కంపెనీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నిబంధనలైతే ఉల్లంఘించారన్న విషయాన్ని ఐటి అధికారులు గుర్తించినట్లు సమాచారం. నవయుగ కంపెనీ యాజమాన్యానికి చంద్రబాబుకు బాగా సన్నిహిత సంబంధాలున్న నేపధ్యంలో ఐటి దాడులు జరగటం సంచలనంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: