ఊహించినట్లుగానే జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి విషయంలో  చంద్రబాబునాయుడు ఎదురుదాడి మొదలుపెట్టారు. విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై జరిగిన దాడి మొత్తం డ్రామాగా కొట్టిపారేశారు. అందరూ కలిసి రాష్ట్రంపై దాడి చేస్తున్నట్లు మండిపడ్దారు. జగన్ పై దాడి జరగ్గానే గవర్నర్,  బిజెపి నేతలు, కేంద్రమంత్రులు, పవన్ కల్యాణ్, కెసియార్, కవిత, కెటియార్  అందరూ వరుసబెట్టి స్పందించిన తీరును చంద్రబాబు అనుమానించారు. భయంకరమైన తిత్లీ తుపాను గురించి స్పందిచని వ్యక్తులు కూడా దాడి డ్రామాలాడుతున్న జగన్ విషయంలో ఎందుకు అంతగా స్పందించారని అందరినీ నిలదీశారు. దాడి సంఘటనను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోద్దామని కుట్ర చేస్తున్నారా ? అంటూ మండిపడ్డారు.

 

జగన్ పై దాడి చేసిన వ్యక్తి, అతని కుటుంబసభ్యులందరూ వైసిపి పార్టీ వాళ్ళే అని తేలిపోయిందన్నారు. దాడిచేస్తే సానుభూతి వస్తుందని, వచ్చే ఎన్నికల్లో సిఎం అవుతారన్న ఉద్దేశ్యంతోనే జగన్ పై దాడి చేసినట్లు స్వయంగా శ్రీనివాస్ ఒప్పుకున్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. అంతా కలిసి డ్రామాలాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తామంటూ సాధ్యం కాదన్నారు. రాష్ట్రప్రభుత్వాన్ని బద్నాం చేయటానికి డ్రామాలాడుతుంటే చూస్తు ఊరుకోనని, కేంద్రం డ్రామాలు ఇక్కడ సాగనివ్వనంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడిని తీవ్రంగా హెచ్చరించారు.

 

పనిలో పనిగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ అధికారాలను కూడా చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖపట్నంలో జగన్ పై జరిగిన దాడి విషయమై గవర్నర్ డిజిపిని అడిగి నివేదిక తెప్పించుకోవటం ఏమిటంటూ హూంకరించారు. గవర్నర్ కు ఏమన్నా అవసరమైతే తనను అడగాలని, తన ద్వారానే నివేదిక తెప్పించుకోవాలి కానీ నేరుగా డిజిపిని అడిగి నివేదిక తెప్పించుకునేందుకు లేదన్నారు. ముందు తన అధికారాలేంటో గవర్నర్ తెలుసుకోవాలంటూ మండిపడ్డారు.

 

ఘటనలో దాడికి గురైన జగన్ అక్కడే పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయకుండా హైదరాబాద్ కు ఎందుకు వచ్చేశారని నిలదీశారు. గాయపడిన జగన్ ను విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది అసలు విమానాం ఎలా ఎక్కనిచ్చారంటూ ధ్వజమెత్తారు. జగన్ చేస్తున్న డ్రామాలకు కేంద్రం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. హైదరాబాద్ కు వచ్చేసి ప్రైవేటు ఆసుపత్రిలో చేరి ఏదో జరిగిపోయినట్లు జగన్ ఆడుతున్న డ్రామాలందరూ చూస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ముందు  ఇంటికి వెళ్లిపోయిన జగన్ తర్వాత మళ్ళీ ఆసుపత్రికి ఎందుకు వెళ్ళారంటూ నిలదీశారు.  


పనిలో పనిగా మీడియాకు కూడా గట్టిగా క్లాస్ పీకారు. మీడియా కళ్ళు మూసుకోవటం మొదలుపెట్టిన తర్వాతే దేశంలో అరాచకం పెరిగిపోయిందన్నారు. ప్రశ్నలు అడగటానికి మీడియా ఎందుకు భయపడుతోందని సూటిగా ప్రశ్నించారు. తప్పుని తప్పుగా చెప్పే ధైర్యం చేయలేకపోతోందంటూ మీడియాపై మండిపడ్డారు. విమానాశ్రయంలో జరిగిన దాడిపై బిజెపి నేతలను మీడియా ఎందుకు నిలదీయలేదన్నారు. నిజాలు రాయటానికి, నిర్భయంగా ప్రశ్నలు వేయటానికి మీడియా ఎందుకు భయపడుతోందో తనకు అర్ధం కావటం లేదని చంద్రబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: