ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు తెర‌దీసిన తెలంగాణాలో.. ప్ర‌చార జోరు హోరెత్తుతోంది. ఎవ‌రికి వారు ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తున్నారు. తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు టీఆర్ ఎస్ అధినేత చంద్ర‌శేఖ‌ర్‌రావు.. ముమ్మ‌ర వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. అదేస‌మ‌యంలో కేసీఆర్‌ను ఓడించేందుకు వివిధ ప‌క్షాలు కాంగ్రెస్ తో క‌లిసి మ‌హాకూట‌మిగా ఏర్ప‌డింది. అంతేకాదు, ఈ మహాకూట‌మి పార్టీలు టికెట్ల కేటాయింపులోను, స్థానాల ఎంపిక‌లోనూ కూడా ఎక్క‌డా గొడ‌వ‌కు దిగ‌కుండా ముందుకు సాగుతున్నారు. దీంతో ఈ ఐక్య కూట‌మి ప్ర‌భావం ఖ‌చ్చితంగా ఎన్నిక‌ల‌పై క‌నిపిస్తుంద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు.  ఈ ప‌రిణామాన్ని ముందు ఊహించ‌ని అధికార టీఆర్ ఎస్ నేత‌లు ఇప్పుడు ఒకింత భ‌య‌ప‌డుతు న్నార‌నే విషయం స్ప‌ష్ట‌మ‌వుతోంది. 


వాస్త‌వానికి తాజా ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేసీఆర్ త‌ర్వాత కేటీఆర్ సీఎం అవుతార‌నే ప్ర‌చారం బాగా ఉంది. అయితే, దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని, మ‌హాకూట‌మిలోని పార్టీలు కేసీఆర్‌కు పొగ‌పెడుతున్నాయి. అంటే.,. కేవ‌లం త‌న త‌న‌యుడిని సీఎం చేసేందుకు మాత్ర‌మే కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా తెలంగాణ ఎన్నిక‌ల‌కు తెర‌దీశాడ‌ని చెప్పుకొస్తున్నారు. ఇది ఒక ర‌కంగా వ్య‌తిరేక ప్ర‌చారంగా మారుతోంది. కేసీఆర్ ప్ర‌భావం త‌గ్గుతుంద‌నే భ‌యం కూడా ఏర్ప‌డుతోంది. ఈ నేప థ్యంలో వెంట‌నే రంగంలోకి దిగిన కేటీఆర్‌.. తెలంగాణా సీఎం కేసీఆరేన‌ని ఆయ‌న ప్ర‌క‌టిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతు న్న ఎన్నికలు రాహుల్‌ కుటుంబం, వారి అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న పోరు అని మంత్రి కేటీఆర్ అన‌డం గ‌మ‌నార్హం.  


టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నట్లుగా నిశ్శబ్ద విప్లవం లేదని, వచ్చేది శబ్ద విప్లవమేనని చెప్పారు. డిసెం బరు 11న మహాకూటమి గూబ గుయ్యిమనడం ఖాయమంటున్నారు. గడ్డం బాబులైన ఉత్తమ్‌, చంద్రబాబు కలిసి కేసీ ఆర్‌ను గద్దె దించుతామంటున్నారని.. ప్రజలంతా వారి అనైతిక పొత్తుపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ‘మీ ఆశీర్వా దంతో టీఆర్‌ఎస్‌ గెలిస్తే కేసీఆరే మళ్లీ సీఎం అవుతార’ని కేటీఆర్ ప్ర‌చారం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు హ‌ఠాత్తుగా కేవ‌లం కేసీఆర్ కేంద్రంగా చేసుకుని కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. టీఆర్ ఎస్ ఇ ప్పుడు భ‌య‌ప‌డుతోంద‌నే ప్ర‌చారం కూడా చాప‌కింద నీరులా ఊపందుకోవడం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని దృష్టిలో పెట్టుకునే కేటీఆర్ ఇప్పుడు ఇలా యూట‌ర్న్ ప్ర‌చారం చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: