విశాఖపట్నం విమానాశ్రయంలో మొన్న 25వ తేదీన జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో సోమవారం సిట్ అధికారులు కీలక విచారణకు తెరలేపారు. హైదరాబాద్ వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్ లో వెయిట్ చేస్తున్న జగన్ దగ్గరకు సెల్ఫీ కోసమని ఎయిర్ పోర్టు క్యాంటిన్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు వచ్చారు. దగ్గరకు వచ్చిన వెంటనే కత్తితీసి పొడిచేశారు. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన జగన్ పక్కకు తప్పుకోవటంతో గొంతులో దిగాల్సిన కత్తి ఎడమభుజం క్రింద పెద్ద గాయం చేసింది. సరే  తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే.

 

స్పాట్ లోనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు విచారణ నిమ్మితం ఆరు రోజులు పోలీసు కస్టడీకి అప్పగించింది. అందులో భాగంగానే ఈరోజు సిట్ అధికారులు నిందితుడిని విచారించారు. శ్రీనివాస్ కు విజయబ్యాంకు, ఎస్బిఐ, ఆంధ్రాబ్యాంకుల్లో ఖాతాలున్నట్లు గుర్తించారు. అదే సమయంలో నిందితుడు ఏడాదిలో తొమ్మిది మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులు వాడినట్లు పోలీసులు గుర్తించారు.  

 

తన స్వగ్రామమైన ఠాణేలంకలో కోటిరూపాయలకు పొలం బేరం కుదుర్చుకున్న విషయం కూడా బయటపడింది. ఓ క్యాంటిన్లో పనిచేసే చిన్నస్దాయి ఉద్యోగి ఏడాదిలో తొమ్మిది మొబైల్ ఫోన్లు వాడటం, కోటిరూపాయలకు పొలం కొనుగోలు చేసేందుకు బేరం కుదుర్చుకోవటం సర్వత్రా అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. ఆ విషయంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు.


విచారణలో నిందితుడు ఎటువంటి బెరుకు లేకుండా సమాధానాలు చెబుతుండటాన్ని పోలీసులు గుర్తించారు. దాడి జరిగిన తర్వాత వెలుగు చూసిన ఫ్లెక్సీని తన సోదరుడు చైతన్య తూర్పుగోదావరి జిల్లాలోని పి గన్నవరంలో తయారు చేసినట్లు చెప్పారు. విచారణాధికారి నాగేశ్వరరావు తర్వాత కమీషనర్ లడ్హా విచారణ సందర్భంగా కూడా శ్రీనివాస్ లో ఎటువంటి భయం కనబడలేదని పోలీసులు చెప్పారు.

 

శ్రీనివాస్ ను తీసుకుని పోలీసు అధికారులు మూడు బ్యాంకులకు వెళ్ళేందుకు రెడీ అవుతున్నారు. ఆ బ్యాంకుల్లో ఖాతాలు ఎప్పుడు తెరిచారు ?  ఆ ఖాతల్లోకి డబ్బు ఎక్కడి నుండి వస్తోంది ? నిందితుడు ఎప్పుడెప్పుడు ఖాతాల్లో నుండి డబ్బులు డ్రా చేసుకున్నాడనే విషయాలను బ్యాంకు అధికారుల సమక్షంలో విచారించేందుకు సిట్ అధికారులు రంగం సిద్దం చేసుకున్నారు. మరి, విచారణలో బ్యాంకు ఖాతాల్లోని డబ్బుపై ఎటువంటి సంచలన వివరాలు వెల్లడవుతాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: