గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలకమైన ఉప్పల్ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారనే విషయంలో రోజురోజుకు  ఉత్కంఠ పెరిగిపోతోంది. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీ మధ్యే కావటంతో రెండు వైపుల నేతల్లోనూ టెన్షన్ పీక్ స్టేజ్ కు చేరుకుంటోంది. పోయిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బిజెపి తరపున ఎంవివిఎస్ ప్రభాకర్ గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్ గెలుపుపై ఎవరిలోను నమ్మకం లేదు. అందుకనే టిఆర్ఎస్, కాంగ్రెస్ టిడిపి అభ్యర్ధులు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టిఆర్ఎస్ అభ్యర్ది గడచిన నెలన్నరగా ప్రచారం చేసుకుంటుంటే మహాకూటమి తరపున ఇంతవరకూ అభ్యర్ధే ఖరారు కాలేదు.

 

అభ్యర్ధి ఎందుకు ఖరారు కాలేదంటే కాంగ్రెస్ , టిడిపిల్లో ఎవరు పోటీ చేయాలో తేలకపోవటమే కారణం. విచిత్రమేమిటంటే రెండు పార్టీల తరపున ఆశావహులు మాత్రం ఎవరికి వారుగా తామే అభ్యర్దిగా ప్రచారం చేసేసుకుంటున్నారు. టిడిపి తరపున మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అదేసమయంలో కాంగ్రెస్ తరపున రాగిడి లక్ష్మారెడ్డి కూడా ప్రచారంలో చొచ్చుకుపోతున్నారు. వీరేందర్ గౌడ్ తరపున తండ్రి దేవేందర్ గౌడ్ టిక్కెట్టు కోసం గట్టి పట్టుపట్టినట్లు సమాచారం.

 

తన కొడుక్కే టిక్కెట్టు దక్కాలంటూ చంద్రబాబుతో దేవేందర్ మాట్లాడారట. అదే సమయంలో లక్ష్మారెడ్డికి టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతుందట. దాంతో ఇరుపార్టీల్లోని అగ్రనేతలు ఉప్పల్ నియోజకవర్గంపై పట్టుబట్టారు. దాంతో రెండు వైపుల నేతల్లోను ఇక్కడ పోటీ చేసేదెవరనే విషయంలో రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. ఈ నియోజకవర్గంలో సీమాంద్రుల ఓట్లు చాలా ఎక్కువ. దానికితోడు తాజా మాజీ ఎంవివిఎస్ ప్రభాకర్ పై విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది. అందుకే టిక్కెట్టు దక్కించుకుంటే ఇరు పార్టీల మద్దతుంది కాబట్టి గెలుపు సులభమనే ఉద్దేశ్యంలో కాంగ్రెస్, టిడిపిలు టిక్కెట్టు కోసం పట్టుబడుతున్నాయి. మరి ఎవరికి టిక్కెట్టు దక్కుతుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: