విజయవాడ వైసీపీ లీడర్‌ వంగవీటి రాధా పొలిటికల్‌ ఫ్యూచర్‌ తీవ్రమైన గందరగోళంలో ఉంది. వైసీపీలో ఉండలా, బయటకు వెళ్లాలా ? అన్నది తేల్చుకోలేక ఆయన తీవ్రంగా సతమతం అవుతున్నట్టే కనపడుతోంది. విజయవాడకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీలోకి వచ్చినప్పటి నుంచి రాధా వైసీపీలో అస్థిరంగానే ఉంటున్నారు. గతంలో వీరిద్దరు సెంట్రల్‌ సీటు నుంచే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 2009లో రాధా కాంగ్రెస్‌ నుంచి ప్రజారాజ్యం పార్టీలోకి జంప్‌ చేసినప్పుడు ఆ పార్టీ నుంచి సెంట్రల్‌ నియోజకవర్గంలో పోటీ చేసి మల్లాది విష్ణు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికలకు ముందు రాధా తూర్పు నియోజకవర్గానికి మారి అక్కడ నుంచి పోటీ చేసి మళ్ళీ ఓడారు. ఆ తర్వాత ఆయన సెంట్రల్‌ సీటుపై కన్నేసి అక్కడైతేనే అన్ని రకాల ఈక్వేషన్లతో తన గెలుపు సులువు అవుతుందని... 2019లో సెంట్రల్‌లో విజయకేతనం ఎగర వెయ్యాలని డిసైడ్‌ అయ్యి ఆ నియోజకవర్గానికే మారారు. 


మల్లాది విష్ణు వైసీపీలోకి రావడంతో సామాజిక సమీకరణల పరంగా జగన్‌, విష్ణును సెంట్రల్‌ నియోజకవర్గం నుంచే పోటీ చేయించాలని భావించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడలేని విధంగా సెంట్రల్‌ నియోజకవర్గంలోనే 40వేల పైచిలుకు బ్రాహ్మణ సామాజికవర్గం ఓటర్లే ఉన్నారు. దీంతో విష్ణుకు సెంట్రల్‌ సీటు ఒక్కటే ఆప్షన్‌గా ఉంది. ఈ క్రమంలోనే జగన్‌ సైతం సెంట్రల్‌ సీటును విష్ణుకే అప్పగించి రాధాకు ఆయన గతంలో పోటీ చేసిన విజయవాడ తూర్పు లేదా అవనిగడ్డ అసెంబ్లీ లేదా బందర్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చెయ్యవచ్చని సూచించారు. అయితే తనకు బలమైన సెంట్రల్‌ సీటును వదిలి వచ్చేందుకు ఇష్టపడిన రాధా జగన్‌ ఇచ్చిన ఆప్షన్లుకు ఆన్సర్‌ మాత్రం ఇవ్వలేదు. రోజులు గడుస్తున్నా రాధా నుంచి క్లారిటీ లేకపోవడంతో తాజాగా జరిగిన బందరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమీక్షలో జగన్‌ బందర్‌ నుంచి తెనాలి మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. 


ఇప్పుడు రాధాకు విజయవాడ తూర్పు ఒక్కటి మాత్రమే ఆప్షన్‌గా ఉంది. అయితే అక్కడ కూడా మరో మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. రాధాకు ఆ సీటు ఇచ్చినా గందరగోళం తప్పేలా లేదు. ఇప్పటి వరకు రాధాకు రెండు మూడు ఆప్షన్లు ఇచ్చిన జగన్‌ రాధా ఎటూ తేల్చకుండా సెంట్రల్‌ నుంచే పోటీ చెయ్యాలని బలంగా డిసైడ్‌ అయ్యి ఉండడంతో బందర్‌ ఎంపీ సీటును సైతం ఫిలప్‌ చేసేశారు. రేపో మాపో రాధా ఇలాగే నాన్చుతూ ఉంటే తూర్పు సీటుపై సైతం ఓ క్లారిటీ ఇస్తే రాధాకు అసలు వైసీపీలో పోటీ చేసే ఛాన్స్‌ కూడా ఉండే పరిస్థితి కనపడడం లేదు. ఏదేమైనా రాధా విజయవాడ సెంట్రల్‌లో మినహా ఎక్కడా పోటీ చేసేందుకు  ఇష్టంతో ఉన్నట్టు కనపడడం లేదు. ఒకవేళ‌ అదే నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాల్సి వస్తే రాధాకు పార్టీ మారి జనసేన నుంచి పోటీ చెయ్యడం ఒక్కటే ఆప్షన్‌గా ఉంది. మరి ఈ వంగవీటి వారసుడి డెషిషన్‌ ఎలా ? ఉంటుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: