చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు, ఓ ఎంఎల్ఏ వియ్యంకునిపై ఐటి దాడులు జరిగాయి. ఈ రోజు ఉదయం హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో ఉన్న కార్యాలయాలతో పాటు తిరుపతిలోని ఇంటిపైన కూడా ఐటి అధికారులు ఏకకాలంలో దాడులు జరగటం గమనార్హం. చంద్రగిరికి చెందిన తెలుగుదేశంపార్టీ నేత పేరం హరిబాబు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. గడచిన రెండు ఎన్నికల్లో చంద్రగిరిలో పోటీ చేసేందుకు టిడిపి టిక్కెట్టుపై ప్రయత్నాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిత్తూరు, తమిళనాడు, కర్నాటకల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు. పేరంను జిల్లాలో చాలామంది చంద్రబాబుకు బినామీ అని చెప్పుకుంటారు.

 

గడచిన నాలుగున్నరేళ్ళలో పేరం వ్యాపారాల స్ధాయి ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాస్ తో పేరం వియ్యం అందుకున్నారు. యరపతి మైనింగ్ పైన కూడా విపరీతమైన ఆరోపణలున్న విషయం తెలిసిందే.  వందల కోట్ల రూపాయల మేర అక్రమ మైనింగ్ జరుగుతోందని స్వయంగా హైకోర్టే ప్రభుత్వంపై మండిపడిన విషయం అందరికీ తెలిసిందే. మైనింగ్ మొత్తం యరపతే చేస్తున్నారు. అంటే ఇటు యరపతినేని అటు పేరం ఇద్దరి వ్యాపారాలు నాలుగున్నరేళ్ళల్లోనే ఒక్కసారిగా ఆకాశం అంత ఎత్తుకు పెరిగిపోయాయి. కాబట్టి వీరిద్దరిని కలిపింది కూడా బహుశా చంద్రబాబే కావచ్చు.

 

మొత్తం మీద చంద్రబాబుకు బాగా సన్నిహితులు అని ముద్రపడిన వారిపైన, బినామీలని ముద్రపడిన వారందరిపై ఐటి, ఈడి దాడులు జరుగుతుండటం గమనార్హం. మాజీ ఎంఎల్ఏ బీద మస్తాన్ రావు,  ఎంఎల్ఏ పోతుల రామారావు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, సిఎం రమేష్ తదితరులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇఫుడు పేరంపైన కూడా దాడులు జరగటంతో టిడిపి నేతల్లో ఎవరిపై ఎప్పుడు ఐటి దాడులు జరుగుతాయో అన్న టెన్షన్ పెరిగిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: