ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు నీరుకారిపోతుందా, సాక్ష్యాలు  ఏవీ మిగలలేదా, ఈ కేసు కోర్టులో నిలబడడా అంటే సమాధానం అవుననే వస్తోంది. దీనిపై న్యాయ నిపుణులు అదే చెబుతున్నారు. అనేక లోటుపాట్లు ఈ కేసుకు సంబంధించి ఉన్నాయట. అందువల్ల ఇది మిస్టరీగానే ఉండిపోతుందంట.


వైసీపీ నేతల పొరపాటు:


జగన్ పై దాడి జరిగిన వెంటనే పక్కనే వున్న వైసీపీ నేతలు నిందితుని వద్ద నుంచి కత్తిని తీసి తమ వద్దకు తీసుకున్నారు. ఆ కత్తికి అంటిన రక్తంలో విషపూరిత పదార్ధాలు ఉన్నాయా, రసాయనాలు ఉన్నాయా అన్నది పరిశోధించే పనిని వారే పోలీసుల అవతారమెత్తి కత్తిని విశాఖ నగరంలోని అనేక  ల్యాబ్ లకు తిప్పినట్లుగా చెబుతున్నారు. చివరకు ఆ కత్తిపై ఉన్న రక్తం మరకలను తుడిచేసి  కేంద్ర పోలీసు  బలగాలకు అప్పగించారని తెలుస్తోంది. కత్తి పోలీసులకు అందే వేళకు దాని మీద చాలా మంది వేలి ముద్రలు ఉండడం జరిగింది. దాంతో తొలి సాక్ష్యం అలా చెరిగిపోయిందట.


అది రికార్డు కాలేదు :


ఇక జగన్ పై జరిగిన హత్యాయత్నం కూడా సీసీ కెమెరాలు వీఐపీ లాంజ్ లో లేకపోవడం వల్ల రికార్డ్ కాలేదు. జగన్ రక్తంతో ఉండడం, నిందితున్ని పోలీసులు పట్టుకుని తేవడం వరకు మాత్రమే సీ సీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇది న్యాయ విచారణలో  ఎంతవరకూ ఉపయోగపడుతున్నదన్నది సందేహమేనని అంటున్నారు. ఇక జగన్ రక్తం  అంటిన చొక్కాతో ఘటనా స్థలం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇపుడు ఆ చొక్కా మాత్రమే కాస్తో కూస్తో ఉపయోగపడే ప్రధాన ఎవిడెన్స్ అవుతుందంటున్నారు.

.

ఇక, నిందితుడు శ్రీనివాస్ జగన్ కి రాసినట్లుగా చెబుతున్న లేఖ పూర్తిగా వైసీపీకి అనుకూలంగానే ఉంది. పైగా ఇందులో ఒకే దస్తూరీ లేదు. అందువల్ల ఇది కూడా సాక్ష్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియదు. ఏది ఏమైనా వైసీపీ నేతల అతి ఉత్సాహం, ఘటన జరిగినపుడు జగన్ పక్కనే ఉన్న పోలీసుల నిర్లక్ష్యం వెరసి అతి కీలకమైన కేసులో సాక్ష్యాలు పెద్దగా లేకుండా చేసేలా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: