తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేత, మాజీ ఎంఎల్ఏ అశోక్ బాబు జనసేనలో చేరటానికి రంగం సిద్ధమైంది.  జిల్లా రాజకీయాల్లో తుని నియోజకవర్గానికి ప్రత్యేకమైన చరిత్రుంది. రాబోయే ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున హేమాహేమీలు పోటీ పడే అవకాశం ఉంది. మొన్నటి వరకూ పోటీ టిడిపి, వైసిపి అభ్యర్ధుల మధ్యే ఉంటుందని అందరు అనుకున్నారు. అటువంటిది ఇంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎంఎల్ఏ అశోక్ బాబు జనసేనలోకి చేరుతుండటంతో తుని నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

 

ఇప్పటి వరకూ అశోక్ జనసేనలో చేరుతారన్నది కేవలం ఊహాగానాలకు పరిమితమైంది. అయితే ఇప్పుడు మాత్రం ఆయన చేరికపై స్పష్టత వచ్చింది. మంచిరోజు చూసుకుని జనసేనలో చేరుతానని ప్రకటించటంతో జనసేన నేతల్లో ఒక్కసారిగా ఉత్సాహం కనబడుతోంది. ప్రజాపోరాట యాత్ర సన్నాహాల్లో భాగంగా జనసేన నేతలు కందుల దుర్గేష్, పంతం నానాజిలు అశోక్ ఇంటికి వెళ్ళి చర్చలు జరిపారట. దాంతో పవన్ పర్యటన సమయంలో మంచిరోజు చూసుకుని పార్టీలో చేరుతానని చెప్పారు.


నిజానికి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో జనసేనకు గట్టి అభ్యర్ధులు లేరనే చెప్పాలి. జనసేన తరపున పోటీ చేసి మిగిలిన అభ్యర్ధులకు గట్టి పోటీ ఇవ్వగలడు అనే స్ధాయి నేతలే జనసేనలో లేరు. అటువంటిది నియోజకవర్గంలో గట్టి పట్టున్న అశోక్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవటం సానుకూలమే.


అశోక్ కుటుంబానికి దశాబ్దాల రాజీకీయ చరిత్రుంది. పోయిన ఎన్నికల్లో రాజకీయాలకు దూరంగా ఉన్న అశోక్ బాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి రెడీ అయ్యారు. అందులో భాగంగానే జనసేనను ఎంచుకున్నారు. ఆయనకున్న రాజకీయ వారసత్వం, కుటుంబానికున్న మంచిపేరు, నియోజకవర్గంలో పట్టు తదితరాలను గమనిస్తే రాబోయే ఎన్నికల్లో తునిలో పోటీ మంచి రంజుగా ఉండే అవకాశం ఉందని అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: