చంద్రబాబునాయుడు గురించి విజయవాడ, చుట్టుపక్కల  హఠాత్తుగా వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఫ్లెక్సీలో రాసున్న విషయం చూస్తుంటే వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. దానికితోడు క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రచారం నిజమే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చేది అనుమానమే అనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. నియోజకవర్గాల్లో పరిస్ధితులు కూడా అలాగే కనిపిస్తోంది. చేయించుకుంటున్న సర్వేలు కూడా అదే విషయాన్ని సూచిస్తున్నాయి.

 

ఈ నేపధ్యంలోనే చంద్రబాబు గురించి కొన్ని చోట్ల పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. దాని ప్రకారం వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలట. అప్పట్లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా భిన్నమైన పార్టీలను ఏకం చేసిన ఎన్టీయార్ లాగ ఇపుడు నరేంద్రమోడికి వ్యతిరేకంగా అదే విధమైన పాత్రను పోషించాలని టిడిపి అభిమాని కాట్రగడ్డ బాబు పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాట్రగడ్డ గతంలో బిజెపి, జనసేనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అప్పట్లో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.


అప్పట్లో ఎన్టీయార్ ను ఆశీర్వదించినట్లుగానే  ప్రజలు ఇపుడు చంద్రబాబును కూడా ఆశీర్వదించాలని ఫ్లెక్సీల్లో కాట్రగడ్డ విజ్ఞప్తి చేయటం గమనార్హం. నగరంలోని స్టేడియం, స్వరాజ్య మైదానం, కంట్రోలు రూమ్, వెలగపూడి తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఎన్టీయార్ ను చంద్రబాబును కాట్రగడ్డ పోల్చటాన్ని ఎన్టీయార్ అభిమానులు తప్పుపడుతున్నారు. ఎన్టీయార్ రాజకీయాలెపుడు విలువలతో కూడినవన్న విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీయార్ ఏమి చేసినా ధైర్యంగా చేశారు. ఎన్టీయార్ లో అప్పట్లో  ఇందిరాగాంధి వ్యతిరేకులంతా రియల్ ఫైటర్ ను చూశారు.


కానీ చంద్రబాబులో ఎన్టీయార్ కున్న ఒక్క లక్షణం కూడా లేదు. చంద్రబాబుది ఎప్పుడూ బ్యాక్ డోర్ పాలిటిక్సే. ఏ విషయాన్ని సూటిగా చెప్పే ధైర్యం లేదు.  విశ్వసనీయత లేని రాజకీయ నేతల్లో చంద్రబాబు ముందుంటారన్న విషయం జాతీయ పార్టీల నేతలకు బాగా తెలుసు. బిజెపిని ఎన్నిసార్లు తిట్టారో అన్నిసార్లు పొత్తులు పెట్టుకున్నారు. ఇంతకాలం కాంగ్రెస్ ను తిట్టి ఇపుడు అదే కాంగ్రెస్ తో తెలంగాణాలో పొత్తులుపెట్టుకున్నారు. విభజన హామీల్లో ప్రధానమైన ప్రత్యేకహోదాపై ఎన్ని పిల్లిమొగ్గలేశారో అందరూ చూసిందే.


చివరకు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని తనను సిఎం కుర్చీలో నుండి దించేయాలని చంద్రబాబు అండ్ కో ప్లాన్ చేస్తున్నట్లు తెలిసినా వివాహం చేసుకున్న లక్ష్మీపార్వతిని  మాత్రం వదిలి పెట్టలేదు. అటువంటి విలువలు పాటించే ఎన్టీయార్ తో చంద్రబాబును పోల్చటాన్ని ఎన్టీయార్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: