ఒకే కుటుంబంలా టీడీపీ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు మురిసిపోతున్నారు. మరో వైపు పార్టీలోని నాయకుల  సొంత కుటుంబాల‌లోనే కలహాలు రేగుతున్నాయి. అన్నదమ్ముల మధ్య చిచ్చు రేగి అసలుకే ఎసరు పెడుతోంది. ఏకంగా పంచాయతీ ఇపుడు చంద్రబాబు వద్దకే చేరింది.


కంచుకోటలో మంటలు :


నర్శీపట్నం సీటు టీడీపీకి కంచుకోట. పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటికి రెండు సార్లు తప్ప మొత్తం టీదీపీదే విజయం. అటువంటి చోట ఇపుడు విభేదాలు ముసురుకున్నాయి. బయట పార్టీలో కాదు, మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంట్లోనే కత్తులు దూసుకుంటున్నారు. అయ్యన్న వారసత్వం కోసం తమ్ముడు,కొడుకు మధ్య సాగుతున్న పోరు ఇపుడు  క్లైమాక్స్ కి చేరింది.


బాబుకు ఫిర్యాదు :


అయ్యన్న తమ్ముడు, నర్శీపట్నం మునిసిపాలిటీ వైఎస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు ఆవేశంతో రగిలిపోతున్నారు. పార్టీలో అయ్యన్న కొడుకు విజయ్ పాత్రుడు వేలు పెట్టడాన్ని సహించలేకపోతున్నారు. పార్టీలో మంత్రి కొడుకు పెత్తనం ఏంటని నిగ్గదీస్తున్నారు. ఈ విషయమై డైరెక్ట్ గా బాబుకే సన్యాసిపాత్రుడు లేఖ రాశారు. విజయ్ కి పార్టీతో ఏమాత్రం సంబంధం లేకపోయినా మంత్రి గారి కొడుకు హోదాలో చలామణీ అవుతూ లేని పోని వర్గాలు క్రియేట్ చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. వెంటనే జోక్యం చేసుకోకపోతే పార్టీ బాగా నష్టపోతుందని కూడా హెచ్చరించారు.


హైకమాండ్ కి ఇబ్బందే:


వచ్చే ఎన్నికల్లో అయ్యన్న వారసత్వంగా రాజకీయ రంగ ప్రవేశం చేద్దామని అయ్యన్న కొడుకు, తమ్ముడు ఇద్దరూ అనుకుంటున్నారు. అయ్యన్న కూడా తన మద్దతు కొడుకు వైపే ఉండడంతో సోదరుడు గుస్సా అవుతున్నారు. ఈ పంచాయతీ బాబే తీర్చాలంటూ ఫిర్యాదు చేసేశారు. మరి హైకమాండ్ ఆలోచన ఎలా ఉంటుంది, అయ్యన్నకు సపోర్ట్ గా ఉంటారా, సోదరుడికా, లేక ఇద్దరికీ నచ్చచెప్పి సర్దుబాటు చేస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా నర్శీపట్నంలో వైసీపీ బాగా బలం పుంజుకుంటున్న వేళ‌ ఇలా టీడీపీలో గొడవలు పెరగడం పార్టీకి చేటు తెస్తుందని కార్యకర్తలు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: