ఇల్లు అలకగానే పండుగ కాదన్నది పాత సామెత. ఇపుడు చంద్రబాబు విషయంలోనూ అదే చెప్పుకోవాలి. ఆయన మీద పెద్ద బాధ్యతే పడింది. ఆయనంతా ఈజీగా ఎవరూ రాజకీయాల్లో ప్లేట్ ఫిరాయించేయలేరు. ఇద్దరు ప్రత్యర్ధులను కలపడం అన్నది చాలా కష్టతరమైన వ్యవహారం. స్థానిక పరిస్థితులు బట్టి అవి ఆధారపడి ఉంటాయి. తప్ప ఎవరో చెప్పారని చేసేయలేరు.


వారంతా ముందునుంచి:


ఇక చూసుకుంటే నిన్న చంద్రబాబు డిల్లీలో కలసిన నేతలంతా ముందు నుంచి బీజేపీకి వ్యతిరేకులే. బాబు మోదీతో ఉన్నప్పటి నుంచి కూడా వారు కేంద్రాన్ని నిలదీస్తూ ఉద్యమిస్తున్నవారు. వారు కాకుండా మిగిలిన వారిని కూడగడితేనే బాబు గొప్పతనం బయటపడేది. ఇక యూపీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో స్థానికంగా కత్తులు దూసుకుంటున్నారు. కేరళలో కాంగ్రెస్ కి కామ్రేడ్స్ బద్ద విరోధులు. తెలంగాణాలో టీయారెస్ ని కూటమిలోకి తేలేరు. ఎందుచేతనంటే  ఇక్కడ కాంగ్రెస్ కి ఆ పార్టీ శత్రువు. ఏపీలో వైసీపీ, జనసేన కూటమి లోకి రాలేవు కదా.


ఆ ఇద్దరూ బహు కష్టం :


ఇక చంద్రబాబు తనకు ప్రధాని పదవిపై మోజు లేదని చెప్పారు. మంచిదే కానీ మిగిలిన నాయకులు అలా కాదు కదా. త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ నాయకురాలు మాయావతి.  అదే యూపీకి చెందిన వ్రుధ్ధ నేత ములాయం సింగ్ యాదవ్, అవకాశం దొరికితే రేసులోకి వచ్చేసే సీనియర్ నేత శరద్ పవార్ ఇలా చాలా మంది కాచుకుని ఉన్నారు. అతి పెద్ద పార్టీ నాయకునిగా రాహుల్ గాంధి ఉండనే ఉన్నారు.  వీరందరినీ ఒక త్రాటి మీదకు తేవడం చాలా కష్టం.


వారి సంగతి ఎలాగో :


ఇక చంద్రబాబు సర్కార్ మీద ఏపీలో  గత నాలుగున్నరేళ్ళుగా పోరాడుతున్న వామపక్షాలను కలుపుకుని పోవడం బాబు వల్ల అవుతుందా, జాతీయ స్థాయిలో కూటమిలో ఉన్నా ఏపీకి వచ్చేసరికి మా దారి మాదే అంటే మరి ఆ కూటమికి అర్ధం ఏముంటుంది. ఇక కర్నాటకలో అపుడే ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఐనా సర్దుకుంటున్నారంటే లోక్ సభ ఎన్నికల వరకూ ఆగుదామనే. అపుడు అక్కడ కూడా సర్కార్ కూలడం ఖాయం. ఇంతకీ నాయకుడు అన్న వాడు లేకుండా విపక్ష కూటమి ఎలా ముందుకు వెళ్తుంది. అక్కడే వస్తుంది అసలైన గొడవ. మొత్తానికి బాబు భుజానికి ఎత్తుకున్నది భూ భారం కన్నా బరువైన పనే.


మరింత సమాచారం తెలుసుకోండి: