తెలుగుదేశం పార్టీ పుట్టినది లగాయితూ ఇప్పటి వరకూ పెట్టని ఆభరణంగా ఉన్న ఓ పదునైన ఆయుధం చేజారిపోయింది. పార్టీకి గర్వంగా, సంకేతంగా, అన్న గారి బ్రాండ్ గా ఉన్న ఆ ఆయుధాన్ని ఆయన చనిపోయిన ఇన్నేళ్ళ తరువాత పార్టీ పోగొట్టుకుంది. మరి ఆ ఆయుధం ఇపుడు ఎవరి చేతుల్లోకి వెళ్ళింది, ఏమా కధ


ఆత్మగౌరవ నినాదం:


తెలుగు వారి ఆత్మ గౌరవరం కోసం పుట్టిన పార్టీ టీడీపీ, బడుకు, బక్క జీవుల స్వేదం నుంచి పుట్టిన పార్టీ టీడీపీ అంటూ అన్న గారు ఆవేశంగా ప్రసంగం చేస్తూ ఉంటే ఆ ఊపే వేరు. నిజంగా తెలుగు ప్రజలకు ఓ చిరునామా, గుర్తింపు అన్న నందమూరి పార్టీని పెట్టి అందించారు. ఆత్మగౌరవం అంటే టీడీపీ వైపు చూడాల్సిందే. అంటువంటి  ఆ పదునైన ఆయుధాన్ని ఆయన పోయిన తరువాత పెద్దగా పట్టించుకోలేదు. ఇపుడు ఏకంగా పక్కన పడేశారన్న భావన సర్వత్రా వినిపిస్తోంది.


పవన్ అందుకున్నాడు :


ఇపుడు ఆ నినాదాన్ని పవన్ అందుకున్న్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ పవన్ ఘాటైన  ప్రసంగాలు చేస్తున్నారు. తెలుగు పౌరుషాన్ని డిల్లీకి తాకట్టు పెడతారా అంటూ పవన్ సంధించిన ప్రశ్నలకు జవాబు టీడీపీ పెద్దల వద్ద లేనే లేదు. ఏ పార్టీ అయితే ఏపీతో చెలగాటం ఆడిందో అదే పార్టీతో కలసిపోవడాన్ని పవన్ దుయ్యబెడుతున్నారు. కాంగ్రెస్ హఠావో అన్న బాబు ఇపుడు దగ్గరకు తీయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ వల్లనే ఇన్ని అరిష్టాలు అని చెప్పిన టీడీపీ ఇంతలో ఎందుకంతలా మారిందని కూడా ఆయన నిగ్గదీస్తున్నారు.


కోపం అలాగే ఉందిట :


అడ్డగోలుగా విభజించినా కాంగ్రెస్ పై జనాలకు కోపం అలాగే ఉందని, చంద్రబాబు దాన్ని రెట్టింపు చేశారని కూడా పవన్ చెబుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్ కలయికను పవన్ తెలుగు జాతి పౌరుషం, ఆత్మ గౌరవం అంటూ బాగానే వాడుకుంటున్నారు. నిజానికి పదునైన ఈ ఆయుధాన్ని సక్రమంగా వాడుకుంటే జనసేనకు జనాదరణ బాగానే ఉంటుంది.


 ఏపీ జనం ఇపుడు రెండు జాతీయ పార్టీలను ఏవగించుకుంటున్నారు. అయితే రాజకీయ నాయకుల మాదిరిగా వారు అయిదేళ్ళకు ఓ మారు ఓట్ల కోసం రాజీలు, కుమ్మక్కులు కాలేరు. సరిగ్గా ఇక్కడే పవన్ వారి ఆకాంక్షలను అర్ధం చేసుకున్నట్లున్నారు. పవన్ ఇకపై అన్న గారి బ్రాండ్ అయిన తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో వెళ్తే జనంలో బాగానే రియాక్షన్ ఉంటుందని అంటున్నారు. మరో వైపు అది టీడీపీకి చేటు కూడా తెస్తుందని విశ్లేషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: