తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే సుప్రీం ఎవరూ లేరు. ఇది లోకానికంతటికీ తెలిసిన విషయమే. ఎంతగా ప్రజాస్వమ్యం గురించి గొంతు చించుకున్నా ఆ పార్టీకి కర్త కర్మ క్రియ బాబే. ఆ మాటకు వస్తే ప్రాంతీయ పార్టీలో అధినేతల మాటే ఫైనల్. వారే సుప్రీం. జాతీయ పార్టీల తీరు ఇపుడు అలాగే ఉంది. అయినా ప్రజాస్వామ్యం గురించి రోజూ మాట్లాడే ఆ పార్టీలలో కొంత వరకైనా పాటిస్తారేమోనని అంతా అనుకుంటారు.


నాడు వార్నింగులు :


ఇక టీడీపీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తు అంటే నాడు సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు భగ్గుమన్నారు. జనం గుడ్డలూడదీసి తంతారని వార్నింగులు ఇచ్చారు. పొత్తు పెట్టుకోమని కూడా స్పష్టంగా చెప్పేశారు. ఇదంతా తెలంగాణాలో మాహా కూటమి ఏర్పాటుకు ముందు మాట. ఆ తరువాత బాబు ఏం చెప్పారో తెలియదు కానీ తెలంగాణా పొత్తులకు మాత్రం ఏపీ టీడీపీ ఓకే అనేశారు. అక్కడ స్థానికి పరిస్థితులు బట్టి పొత్తు ఉంది కానీ ఏపీలో అలాంటిదేం ఉండదని కూడా నమ్మబలికారు. తీరా చూస్తే ఇపుడు ఏపీలోనూ పొత్తుకు రంగం సిధ్ధమైపోయింది.


సభ్యత్వం తీసుకున్న అయ్యన్న:


ఈ రోజు  విశాఖ జిల్లాలో టీడీపీ సభ్యత్వ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న అయ్యన్న తొలి సభ్యత్వం తీసుకున్నారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఈ ఏడాది కోటి మంది సభ్యత్వం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికి అరవై అయిదు వేలు ఉందన్నారు. నర్శీపట్నంలోనూ పాతిక‌ వేల సభ్యత్వం చేసి చూపిస్తామంటూ గట్టిగా చెప్పారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం కలిగిన పార్టీ టీడీపీయేనని కూడా అన్నారు. ఇన్ని చెప్పిన అయ్యన్న కాంగ్రెస్ టీడీపీ కొత్త బంధం గురించి మాత్రం ఏమీ మాట్లాడకపోవడం విశేషం. అంటే ఆయన కూడా రాజీ పడిపోయినట్లుగానే భావించాలని అంటున్నారు.


సొంత చిక్కులు :


ఈ మధ్యన కుటుంబంలోనే వివాదాలు, కొడుకు, తమ్ముడు మధ్య వారసత్వ పోరు బాబు వద్దకే పంచాయతీ చేరడం, నియోజకవర్గంలో పలుకుబడి తగ్గడం, వైసీపీ పుంజుకోవడం వంటి పరిణామాల నేపధ్యంతో పాటు బాబు గతంలోనే పొత్తుల విషయమై గట్టిగా క్లాస్ తీసుకున్నారన్న ప్రచారం నేపధ్యంలో అయ్యన్న ఈసారి పూర్తిగా మౌనం వహించారని అంటున్నారు. సో పార్టీ పుట్టినప్పటినుంచి ఉన్న సీనియర్లు  ఇలా మౌనంగా అంగీకరిస్తే ఈ పొత్తుకు రాజ ముద్ర పడిపోయినట్లేనంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: