ఆశ పడినా లక్ ఉండాలి. అవకాశాలు ఇస్తామన్నా అందుకునే భాగ్యం ఉండాలి. అన్నీ ఉన్నా కాలం కలసిరావాలి. అలా జరగనపుడు అవి అడియాశలే అవుతాయి. కొన్ని సార్లు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని మరీ అద్రుష్టలక్ష్మి తలుపు తడుతుంది,  మరి కొన్ని సార్లు వెంటపడినా లక్ కలసిరాకుండా షాక్ ఇస్తుంది. ఇక విశాఖ జిల్లా వరకు వస్తే ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరి మావోల చేతిలో దారుణ హత్యకు గురి అయ్యారు. మరో ఎమ్మెల్యేకు హై కమాండ్ షాక్ ఇవ్వబోతోందని టాక్.


కొంప ముంచనున్న పొత్తు :


కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు తమ్ముళ్ల కొంప ముంచేలా కనిపిస్తోంది. విశాఖ వరకూ తీసుకుంటే రెండు ఎమ్మెల్యే సీట్లను తమ్ముళ్ళు పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిందే. అదే జరిగితే సిట్టింగులతో పాటు ఆశావహులు కూడా ఇంట్లో కూర్చోకతప్పదు. అలా దెబ్బ పడుతున్న సిట్టింగులలో  ఇద్దరు ఇపుడు తెర ముందు కనిపిస్తున్నారు. వారు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ , మరొకరు ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.


ఆ రెండు సీట్లు కాంగ్రెస్ కేనట:


విశాఖ జిల్లాలో రెండు సీట్లు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. విశాఖ దక్షిణం  నుంచి టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి  గణేష్ కుమార్ సీటుకు పొత్తులో భాగంగా ఎసరు వచ్చేలా ఉంది. ఈ సీటుని కాంగ్రెస్ కి ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం అపుడే మొదలైంది. ఈ సీటు నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణం రాజు శ్రీనివాస్ పోటీ చేస్తారని అంటున్నారు.  దీంతో వాసుపల్లి అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఇక, మరో సీటు పాడేరు. ఇక్కడ నుంచి మాజీ మంత్రి కాంగ్రెస్ నేత పసుపులేటి బాలరాజు పోటీకి సిధ్ధపడుతున్నారు. ఆయనకు కూడా కన్ ఫర్మ్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు.


గిడ్డికి షాక్ :


అదే జరిగితే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి గట్టి షాక్ తగలకమానదు. మంత్రిని చేస్తామని సైకిలెక్కించిన అధినాయత్వం ఇపుడు ఉన్న సీటు కి కూడ ఎసరు పెడితే గిడ్డి ఏం చేస్తారో చూడాలి. నిజానికి ఆమె వైసీపీలో ఉంటే మరో మారు ఎమ్మెల్యే టికెట్ తో పాటు విజయమూ ఖాయమే. పార్టీ పవర్లోకి వస్తే మంత్రి ఆశ కూడా నెరవేరేది. ఇపుడు చూసుకుంటే సీన్ రివర్స్ అయ్యేట్లుందని అనుచరులు వాపోతున్నారు.  మరి ఏం జరుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: