జిల్లాలోని సీనియర్ నేత, రెబల్ లీడర్ కరణం బలరామ్ కు తీరని అవమానం జరిగిందా ? జరిగిందనే జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇపుడు జరిగిన అవమానం లాంటిది ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదని కూడా చెప్పుకుంటున్నారు. ఇంతకీ కరణంకు జరిగిన అవమానం ఏమిటి ? ఏమిటంటే, మొన్ననే చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే కదా . ఆ సందర్భంగా జిల్లా నేతలతో సమీక్షా సమావేశం జరిపారు.

 

సమీక్ష రావాల్సిందిగా నేతలందరికీ ముందుగానే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అందరికీ సమాచారం అందించారు. దాంతో అందరితో పాటు కరణం బలరామ్ కూడా సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. అందరు వచ్చిన విషయం నిర్ధారణ చేసుకుని సమీక్ష మొదలుపెట్టే ముందు చంద్రబాబు నుండి కరణంకు ఓ సమాచారం అందిందట. ఇంతకీ ఆ సమాచారం ఏమిటంటే, సమీక్షలో కరణం అవసరం లేదు, బయటకు వెళ్ళిపోమని. దాంతో ఒక్కసారిగా కరణంకు షాక్ కొట్టినట్లైందట. సమీక్ష నుండి తనను మాత్రమే ఎందుకు బయటకు వెళ్ళిపొమ్మని చంద్రబాబు ఎందుకు ఆదేశించారో అర్దంకాలేదు. సరే, చేసేదేం లేదు కాబట్టి వెంటనే సమీక్షా సమావేశం నుండి బయటకు వెళ్ళిపోయారట.

 

తనకు ఇంతటి అవమానం జరగటానికి ఫిరాయింపు ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమారే కారణమని కరణం మండిపోతున్నారు. వైసిపి తరపున పోయిన ఎన్నికల్లో గెలిచిన గొట్టిపాటి తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించిన దగ్గర నుండి కరణంకు సమస్యలు మొదలయ్యాయి. గొట్టిపాటిని నమ్ముకున్న చంద్రబాబు కరణాన్ని ఈక క్రింద కూడా లెక్కేయటం లేదు. దాంతో పార్టీలోని సీనియర్ నేతలపైనే కాకుండా చంద్రబాబు మీద కూడా కరణంకు మండిపోతోంది. అయితే  చేసేది లేక అవమానాలను దిగమింగుకుంటున్నారు.

 

రోజురోజుకు అవమానాలు ఎక్కువైపోతుండటంతో కరణం చూపు వైసిపి వైపు మళ్ళింది వాస్తవమే. తన కొడుక్కి అద్దంకి అసెంబ్లీ టిక్కెట్టిస్తే వైసిపిలోకి చేరుతానంటూ కరణం షరతు పెట్టారట. విషయం  ఇంకా జగన్ దగ్గరే పెండింగ్ లో ఉందట. ఎన్నికలు దగ్గర పడినపుడు కరణం కొడుకుతో పాటు వైసిపిలో చేరిపోవటం ఖాయమనే ప్రచారం ఊపందుకున్నది. అదే విషయాన్ని పార్టీ వర్గాల ద్వారానే కాకుండా గొట్టిపాటి ద్వారా కూడా చంద్రబాబు దగ్గరకు చేరిందట.

 

ప్రత్యక్షంగా గొట్టిపాటితో పడకపోవటమే కాకుండా జిల్లాలోని చాలామంది నేతలతో కరణంకు సంబంధాలు చెడిందన్నది వాస్తవం. ఎప్పుడైతే కరణాన్ని చంద్రబాబు దూరంగా పెట్టేశారో అప్పటి నుండి తెలుగుదేశంలో కరణానికి కష్టకాలం మొదలైంది. చివరకు మొన్నటి సమీక్షా సమావేశం నుండి కూడా బయటకు పంపేశారట. నిజానికి కరణం టిడిపిలో చంద్రబాబుకన్నా సీనియర్ అని చెబుతుంటారు. ఎంతటి సీనియర్ కైనా కాలం కలసిరానపుడు చేసేదేం లేదుకదా ?


మరింత సమాచారం తెలుసుకోండి: