సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరిట తొలి అడుగు వేశారు. మూడు వేల కిలోమీటర్లు, పదమూడు జిల్లాలు టార్గెట్ గా చేసుకుని జగన్ తలపెట్టిన పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు స్రుష్టించింది. పులువెందుల నుంచి  2017 నవంబర్ 6న మొదలైన పాదయాత్ర ఒక్కో అడుగూ ముందుకు సాగుతూ అంతకు రెట్టింపు జనాదరణను సొంతం చేసుకోవడంతో సహజంగానే అధికార పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి.


జగన్లో కొత్త కోణం :


పాదయాత్ర ద్వారా జగన్ లోని పట్టుదల, వెరవని మనస్తత్వం ప్రజలు ప్రత్యక్షంగా చూడగలిగారు. అదే విధంగా గతంలో ఆయన తండ్రి కంటే మిన్నగా జగన్ కి జనం జేజేలు పలికారు, జగనే  జనం అన్నట్లుగా పాదయాత్ర సాగిపోయింది. జగన్ జనాలకు బాగా దగ్గర అయ్యారు. అదే సమయంలో ఆయనలోని మానవత్వంపు కోణాలు ఎన్నో జనం దగ్గరుండి మరీ చూసే అవకాశమూ కలిగింది. జగన్ బురదలోనూ, సందుల్లోనూ, గొందుల్లోనూ అడుగులు వేస్తూ సాగించిన పాదయాత్ర ఆయన ఏమైనా చేస్తారని చెప్పగలిగింది.


జగన్ కూడా తెలుసుకున్నారు :


ఇక జగన్ విషయానికి వస్తే ఆయన పదేళ్ళుగా జనంలోనే ఉంటున్నారు. కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేకపోయినా అధికార పార్టీ హామీలు ఎలా అమలవుతున్నాయి. ప్రజలకు అవి చేరుతున్నాయా, జన్మ భూమి కమిటీల సంగతేంటి, టీడీపీ గురించి జనం ఏమనుకుంటున్నారు. వైసీపీ పట్ల అభిప్రాయం ఎలా ఉంది అన్నది ఏ సర్వే చెప్పకుండానే జగన్ స్వయంగా తెలుసుకోగలిగారు. అలాగే వైసీపీలో ఉన్న లోపాలు, నాయకుల పనితీరు కూడా జగన్ కళ్ళకు కట్టినట్లుగా పాదయాత్ర చూపించేసింది.


పార్టీ గ్రాఫ్ పెంచింది :


ఇక జగన్ జనంలో పాదయాత్ర రూపంలో రావడంతో ఆయన పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిందనే చెప్పాలి. పాదయాత్రకు ముందు తరువాత అన్నంతగా పార్టీ జోరు కనిపించింది. జగన్ కే కాదు, మొత్తం వైసీపీకి ఒక ధీమాను పాదయాత్ర ఇచ్చింది. అదే టైంలో అధికార టీడీపీకి కూడా వచ్చే ఎన్నికలు అంత సులువు కావని, జగన్ ని ఓడించడం కష్టమన్న భావన కూడా కలిగించింది. జగన్ సైతం పార్టీ ప్రక్షాళనకు కూడా పాదయాత్రను బాగా ఉపయోగించుకుంటున్నారు.


11 జిల్లాలు పూర్తి :


జగన్ పాదయాత్ర ఇప్పటివరకూ 11 జిల్లాల్లో పూర్తి చేసుకుంది, ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర జరుగుతోంది. ఇప్పటికి 122 నియోజకవర్గాలు, 205 మండలాలు, 1739 గ్రామాల మీదుగా జగన్ పాదయాత్ర సాగింది. జగన్ పై గత నెల 25న విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాస్ అనే నిందితుడు కత్తితో దాడి చేశారు. దాంతో పాదయాత్రకు బ్రేక్ పడింది. తిరిగి ఈనెల పాదయాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు తెలియచేస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: