తెలంగాణాలో అధికార పార్టీ టీఆర్ ఎస్ నుంచి బ‌రిలోకి దిగుతున్న దాదాపు 100 మంది అభ్య‌ర్థుల జాబితాను టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ గ‌త నెల ప్ర‌భుత్వ ర‌ద్దు స‌మయంలో అనూహ్యంగా అంద‌రినీ ఆశ్చ‌ర్యంలోకి  నెడుతూ ప్ర‌క‌టించారు. దీంతో ఒక్క‌సారిగా విప‌క్షాలు స‌హా మీడియా కూడా పెద్ద ఎత్తున ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాయి. దీనికి తోడు అంద‌రూ సిట్టింగులే కావ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇక‌, ఆ వెంట‌నే కేసీఆర్ మ‌రింత ఆశ్చ‌ర్యంగా ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించారు. తానే స్వ‌యంగా ఎన్నిక‌ల ప్ర‌చారానికి దిగారు. తొలి ప్ర‌చారాన్ని అత్యంత ఆర్భాటంగా నిర్వ హించారు. ఇలా మొత్తంగా కేసీఆర్ ఓ ఊపు తెచ్చారు. ఆయ‌న ప్ర‌చారం ప్రారంభించ‌డంతోనే మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సిట్టింగ్ అభ్య‌ర్థులు త‌మ త‌మ ప్ర‌చారాల‌ను మొద‌లు పెట్టారు. 


నిజానికి ఎన్నిక‌లకు కేవ‌లం 20 నుంచి 25 రోజుల ముందుగా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డం రాజ‌కీయాల్లో స‌ర్వ‌సాధార‌ణం. దీనికి రెండు ప్ర‌ధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి ప్ర‌త్య‌ర్థి పార్టీలకు అభ్య‌ర్థుల వివ‌రాలు గోప్యంగా ఉంచ‌డం దీనిలో ఒక వ్యూహం. రెండోది ప్ర‌చారానికి అభ్య‌ర్థులు స‌న్న‌ద్ధ‌మ‌య్యేందుకు, ఖ‌ర్చుల‌కు డ‌బ్బు స‌మ‌కూర్చుకునేందుకు ఏర్పాటు చేసుకోవ‌డం, ఖ‌ర్చు పెర‌గ‌కుండా చేసుకోవ‌డం, మ‌రో ముఖ్య రీజ‌న్‌.. సుదీర్ఘ కాలం ప్ర‌చారం అంటే.. ఇటు నాయ‌కుల‌కు, అటు ప్ర‌జ‌ల‌కు కూడా బోర్ కొడుతుంది. ఈ నేప‌థ్యంలోనే సాధార‌ణంగా జాతీయ స్తాయి నుంచి ప్రాంతీయ స్థాయి పార్టీల వ‌రకు అన్నీ వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తాయి. కానీ, కేసీఆర్ మాత్రం అత్యుత్సాహానికి వెళ్లారు. అంద‌రినీ తాను ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాల‌ని అనుకున్నారో ఏమో.. ఆయ‌న చేసిన ప్ర‌యోగం ఆ రోజు వ‌ర‌కు బాగానే ఉన్న‌.. ఇప్పుడు మాత్రం విక‌టించింద‌నే వ్యాఖ్య‌లు సొంత పార్టీ నాయ‌కులు, సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యేల నుంచే వినిపిస్తున్నాయి. 


దాదాపు 22 రోజులుగా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేర‌కు టీఆర్ ఎస్ టికెట్‌ను క‌న్ఫ‌ర్మ్ అయిన నాయ‌కులు ప్ర‌చారం ప్రారంభించారు. ఇదే ఇప్పుడు వారి కొంప ముంచుతోంది. ఇంకా ఎన్నిక‌ల‌కు దాదాపు మ‌రో నెల రోజుల వ్య‌వ‌ధి ఉంది. వివిధ పార్టీల నాయ‌కులు ఇప్పుడిప్పుడే నాయ‌కుల‌కు టికెట్ల‌ను ఖ‌రారు చేస్తున్నాయి. దీంతో త‌మ స్థానాల్లో బ‌ల‌మైన అభ్యర్థులు రంగ‌ప్ర‌వేశం చేస్తుండ‌డంతో మ‌రింత గ‌ట్టిగా ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం టీఆర్ ఎస్ నేత‌ల‌పై ఏర్ప‌డింది. అయితే, గ‌త 22 రోజులుగా చేస్తున్న ప్ర‌చారంతో వారి వ‌ద్ద ఉన్న నిధులు పూర్తిగా క‌రిగి పోయాయి. ఎంత అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయినా.. అనూహ్యంగా ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయ‌డం, ఎక్క‌డి ప్రాజెక్టులు అక్క‌డే ఆగిపోవ‌డంతో కాంట్రాక్టర్ల నుంచి అందాల్సిన నిధులు కూడా ఆగిపోయాయి. 

Related image

పోనీ.. స్థానిక వ్యాపారుల నుంచి ఎన్నిక‌ల ఫండ్ తీసుకుందామ‌న్నా.. మిగిలిన పార్టీల నుంచి అభ్య‌ర్థులు ఖ‌రారు ఆల‌స్యం కావ‌డంతో వ్యాపారులు త‌మ వాటాల‌ను ఇప్ప‌టికీ తేల్చుకోలేక పోతున్నారు. వ్యాపారులు ఆ పార్టీ ఈపార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల‌కూ కొంత మేర‌కు నిధుల‌ను స‌ర్దు బాటు చేస్తుంటారు. అయితే, ఇప్పుడు వీరు కూడా మొహం చాటేశారు. మ‌రోప‌క్క‌, ఎన్నిక‌ల సంఘం నిఘా.. వేసింది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ దెబ్బ‌కు టికెట్లు ఖ‌రారైన అభ్య‌ర్థులు విల‌విల్లాడుతున్నారు. రాబోయే 20 రోజుల‌ప్ర‌చారానికి `స‌రుకు` లేక త‌ల్ల‌డిల్లుతున్నారు.  మ‌రి కేసీ ఆర్ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: